
డిసెంబర్ నాటికి యూనిట్ పనులు పూర్తి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి 2026 మార్చి నాటికి అధికారింగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్‌షెడ్, వ్యాగన్ రిపేర్ షెడ్ మల్టీపుల్ ప్రాజెక్ట్)ను గురువారం రైల్వే జీఎం సందర్శించి ప్రాజెక్ట్ లేఅవుట్ పరిశీలించగా పనుల పురోగతి సమగ్ర నివేదికను అధికారులు వివరించారు. కాన్ఫరెన్స్ హాల్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో యూనిట్ నిర్మాణానికి సంబంధించిన అప్ డేట్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కలియ తిరిగి వివిధ డిపార్ట్‌మెంట్ వివరాలను తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ విలేకరులతో మాట్లాడుతూ షెడ్ అంతర్గత నిర్మాణ పనులు జరుగుతున్నాయని, నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. భద్రతా అంశాలను పరిశీలించి మార్గదర్శకాలు, విధానాలు పాటించేలా అధికారులు నిర్ధారించుకోవాలన్నారు. అంతకు ముందు ప్రత్యేక రైలులో జీఎం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు రియర్ విండో తనిఖీలో ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ, భద్రతా అంశాలను పరిశీలించారు. రైల్వే యూనిట్‌ను తనిఖీ చేసి తిరుగు ప్రయాణంలో కాజీపేట రైల్వే అమృత్ భారత్ పనులు, రైల్వే లాబీ, ఆర్‌ఆర్‌ఐ రిలేను, కాకతీయ రన్నింగ్ రూంను తనిఖీ చేసి సిబ్బంది సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. జీఎం పర్యటన కార్యక్రమంలో సికింద్రాబాద్ రైల్వే డీఆర్‌ఎం భర్తీష్‌కుమార్ జైన్, రైల్వే పీసీఎంఈ సి.మధుసూదన్‌రావు, రైల్వే సీనియర్ డీఈఎన్ కోఆర్డినేషన్ రామారావు, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్‌వాణి, ఆర్‌వీఎన్‌ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి..
జనగామ: రైల్వేస్టేషన్ సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ ఆదేశించారు. గురువారం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వెళ్తూ మార్గమధ్యలో జనగామ రైల్వేస్టేషన్‌లో ఆగారు. స్టేషన్ సేవలు, సుందరీకరణ పనులు, ప్రయాణికుల సౌకర్యాలు తదితర వాటిని పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకుండా చూడాలన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఫ్లాట్‌ఫాంపై షెడ్ల నిర్మాణం, ప్రయాణికులు వేచి ఉండే ఏసీ, జనరల్ గదులు, ముఖ ద్వారం పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.
2026 మార్చిలో అధికారికంగా ప్రారంభం
రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ
కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన

డిసెంబర్ నాటికి యూనిట్ పనులు పూర్తి