
నీళ్లు మింగుతున్నారు..!
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌లో అన్‌యూజ్డ్ పోస్టులను వినియోగంలోకి తీసుకురావడంలో ఖర్చుల పేరుతో జరిగిన వసూళ్లపై ‘సాక్షి’లో ఈ నెల 16న ప్రచురితమైన ‘పంచుకున్నదెవరు’ కథనానికి కొందరు నీళ్లుమింగుతున్నారు. వసూళ్లు, పంపకాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న వారు.. తమ అనుచరుల ద్వారా ‘సాక్షి’ కథనం తర్వాత ఏమి జరుగుతుందని ఆరా తీస్తున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఏళ్లుగా వృథాగా ఉన్న 216 అన్‌యూజ్డ్ పోస్టులు, ఖాళీగా ఉంటున్న 216 అన్‌యూజ్డ్‌పోస్టులను వినియోగంలోకి తీసుకొస్తూ వివిధ కేటగిరీల్లో 339 నూతన పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసింది. అన్‌యూజ్డ్ పోస్టులను వినియోగంలోకి తీసుకురావడానికి నూతన పోస్టులు మంజూరుకు ఖర్చులవుతాయని చెప్పి ఓ ప్రధాన ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకుడు వసూళ్లు చేసినట్లు విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ఇంజనీర్స్ అసోసియేషన్లతో పాటు, ఇతర ఉద్యోగ అసోసియేషన్లు కూడా ఖర్చుల కోసం తమ సభ్యుల నుంచి వసూలు చేసి ఆ ఇంజనీర్ అసోసియేషన్ నాయకుడికి ముట్టచెప్పినట్లు సమాచారం. ఇందులో కొందరు నేరుగా ఓ బ్యాంకు ఖాతాలో జమచేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఇతర మార్గాల్లో ముట్టజెప్పినట్లు తెలిసింది. అయితే కొత్త పోస్టుల మంజూరులో ఎలాంటి డబ్బులు ఖర్చు కాలేదని స్పష్టమవడంతో వసూళ్లు చేసిన సొమ్ము ఎవరెవరి చేతుల్లోకి మారిందనే అంశం కలకలం రేపుతోంది. ‘సాక్షి’ ప్రచురితమైన కథనంతో ఈ డబ్బుల లావాదేవీలతో సంబంధమున్న వారు తమ ప్రమేయం, తమ పేర్లు ఎక్కడ బయటపడుతాయోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దీంతో డబ్బులు చేతులు మారినట్లు వారు పరోక్షంగానే బయటపడుతున్నారు. తన లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను అడ్డుకోవడంతో పాటు, ఎలాగైనా ఆశించింది దక్కించుకోవడానికి ఆ నాయకుడు ఏదైనా చేస్తాడని విద్యుత్ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తనకు పదోన్నతి రావడానికి మూడేళ్లగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాగా, వసూళ్ల పర్వంపై ఇంటెలిజెన్స్‌తో పాటు టీజీ ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. ఎవరు వసూలు చేశారు...? ఎంత మొత్తంలో చేశారు...? ఎవరెవరు పంచుకున్నారు...? ఎవరికి ముట్టజెప్పారు...? వంటి అంశాలపై ఇంటెలిజెన్స్, ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.
అన్‌యూజ్డ్ పోస్టుల కన్వర్షన్‌లో వసూళ్ల పర్వం
‘సాక్షి’ కథనం ‘పంచుకున్నదెవరు’ తో విద్యుత్ ఉద్యోగుల్లో కలకలం
ఇంటెలిజెన్స్‌తోపాటు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణ