
గిరిజన చేతి వృత్తులకు ప్రోత్సాహం
హన్మకొండ: గిరిజన చేతి వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫె డ్) రీజినల్ కార్యాలయం (రెండు తెలుగు రాష్ట్రాలు) జనరల్ మేనేజర్ సుబోజిత్ తరఫ్‌దార్ అన్నారు. గురువారం హనుమకొండ అశోకా కాలనీలోని గిరిజన భవన్‌లో గిరిజన చేతి వృత్తి కళాకారుల ఎంప్యానల్‌మెంట్ మేళా నిర్వహించారు. గిరిజన చేతి వృత్తి కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుబోజిత్ తరఫ్‌దార్ మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం, గిరిజన సంఘాలను బలోపేతం చేయడం, గిరిజన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం, గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ట్రైఫెడ్ కృషి చేస్తుందన్నారు. గిరిజన చేతి వృత్తుల కళాకారుల ఉత్పత్తులు పరిశీలించి వారిని ఎంప్యానల్ చేసుకోవడానికి ఈ మేళా ఏర్పాటు చేశామన్నారు. ట్రైఫెడ్‌కు దేశ వ్యాప్తంగా 150, హైదరాబాద్‌లో మూడు షోరూంలు ఉన్నాయన్నారు. గిరిజనులు ఉత్పత్తి చేసిన వస్తువులను ట్రైఫెడ్ కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తుందన్నారు. ఎంప్యానల్ జాబితాలో చోటు చేసుకున్న వారికి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వారు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తామన్నారు. తద్వారా వారి జీవనోపాధి పెరుగుతుందన్నారు. ప్రధాన మంత్రి వందన్ వికాస్ కేంద్రాస్ ద్వారా గిరిజన స్వయం సంఘాలకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించి వృత్తి శిక్షణ ఇచ్చి వారి ద్వారా వస్తు ఉత్పత్తి చేసి జీవనోపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గిరిజన సంక్షేమాధికారులు ప్రేమకళ, సౌజన్య, ట్రైఫాడ్ మార్కెటింగ్ హెడ్ జిషాన్, మార్కెటింగ్ అసిస్టెంట్ సందీప్ శర్మ, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.
ట్రైఫెడ్ జనరల్
మేనేజర్ సుబోజిత్ తరఫ్‌దార్