
మహిళలు రాజకీయంగా రాణించాలి
హన్మకొండ చౌరస్తా: మహిళలు రాజకీయంగా రాణించాలని, అప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి అన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్ లోని ‘డి’ కన్వెన్షన్‌హాల్‌లో బుధవారం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మహిళలను రాజకీయంగా చైతన్య పరిచి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సమావేశానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, నాయకత్వం చూపే మహిళలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ భారత మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలు రాజకీయంగా రాణించాలన్నారు. ఇందిరమ్మ మార్గంలో పయనిస్తూ దేశాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు నుంచి మొదలు.. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వరకు మహిళలనే యజమానులుగా పరిగణిస్తోందన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు అత్యధిక ప్రాధాన్యవిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అద్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు బంక సరళ, మాజీ ఎంపీ దయాకర్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రణాళిక బోర్డు
ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
మహిళా నాయకత్వ
శిక్షణ శిబిరం ప్రారంభం