
కళ్లు తెరవకముందే.. కాదనుకున్నారు
రఘునాథపల్లి: సరిగా కళ్లు తెరవకముందే ఆ శిశువును కాదనుకున్నారు. తల్లి పొత్తిళ్లలో నిద్రించాల్సిన అప్పుడే పుట్టిన పసికందును రోడ్డున పడేశారు. మానవత్వానికి మాయని మచ్చగా మారిన ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఖిలాషాపూర్ గ్రామం తపాలా కార్యాలయం సమీపంలో రోడ్డు పక్కన బుధవారం తెల్లవారు జామున పసికందు ఏడుపు వినిపిస్తుండడంతో స్థానికులు నిద్రలేచి వెళ్లి చూశారు. లుంగీలో అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా ఎస్సై దూదిమెట్ల నరేశ్ సిబ్బందితో చేరుకుని చైల్డ్‌హెల్ప్‌లైన్ 1098కి సమాచారమిచ్చారు. వారు వచ్చి వెంటనే శిశువును రఘునాథపల్లి పీహెచ్‌సీకి తరలించి అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం జనగామ ఎంసీహెచ్‌కు తరలించారు. సూపరింటెండెంట్ మధుసూదన్, డాక్టర్ మడిపల్లి ఉదయ్‌కుమార్‌గౌడ్ (పిడియాట్రీషన్) ఆధ్వర్యంలో శిశువుకు అవసరమైన బేసిక్ టెస్టులు చేసి పర్యవేక్షణలో ఉంచారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి డి. ఫ్లోరెన్స్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రవికాంత్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరస్వతి ఉన్నారు.
మగ శిశువును రోడ్డున పడేసిన
గుర్తు తెలియని వ్యక్తులు
ఎంసీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో క్షేమం

కళ్లు తెరవకముందే.. కాదనుకున్నారు