
కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి
● సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్
జీవీ వెన్నెల
నయీంనగర్: బ్యాండ్ వాయిద్య కళాకారుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెల అన్నారు. బుధవారం బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర సదస్సు హనుమకొండ ఈద్గా సిటిజన్ హాల్‌లో జరిగింది. ఈ సదస్సుకు వెన్నెల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బ్యాండ్ వాయిద్య కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, హనుమకొండ జిల్లా కన్వీనర్ లింగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బ్యాండ్ వాయిద్య వృత్తే జీవనాధారంగా లక్షలాదిమంది జీవిస్తున్నారన్నారు. అన్ సీజన్‌లో అడ్డమీద కూలీలుగా జీవనం గడుపుతున్నారని, వీరికి ప్రభుత్వ పథకాలు అందజేసి ఆదుకోవాలని కోరారు. ప్రతీ కళాకారుడికి గుర్తింపు కార్డు, జీవిత బీమా, ఆర్థిక సాయం, ఆరోగ్య భద్రత, ఇళ్ల స్థలాలు, పింఛన్, 3 ఎకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. గుమ్మడిరాజు నాగరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో సంఘం నాయకులు రాజాసాబ్, చాంద్‌పాషా, శంకర్, అంజయ్య, బషీర్, వెంకన్న, మల్లేశం, గొడుగు వెంకట్, ఓదెలు, సాంబయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.