
హత్య కేసులో నేరస్తుడికి పదేళ్ల జైలు
భూపాలపల్లి అర్బన్: హత్య కేసులో నేరస్తుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించినట్లు భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్‌లో మార్చి 02, 2020న తాటి వనంలో గ్రామానికి చెందిన మాచర్ల రవి, రేగళ్ల తిరుపతి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో కోపోద్రెకుడైన రవి.. తిరుపతిని హత్య చేశాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ వాసుదేవరావు కేసు నమోదు చేసి రవిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపి రిమాండ్‌కు తరలించారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ ఘటనలో నేరం రుజువుకావడంతో రవికి భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు పదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు సీఐ నరేశ్‌కుమార్ మంగళవారం తెలిపారు.
ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
హన్మకొండ చౌరస్తా: విశ్వబ్రాహ్మణ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (వోపా) ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఏటా ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు విశ్వబ్రాహ్మణ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పురస్కారాల కన్వీనర్, వోపా జిల్లా అధ్యక్షుడు శ్రీరామోజు నాగరాజారావు తెలిపారు. మంగళవారం హనుమకొండ రెడ్డికాలనీలోని వోపా జిల్లా కార్యాలయంలో ప్రతిభా పురస్కారాల కమిటీ సమావేశం నిర్వహించారు. 2024–25 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు దరఖాస్తుతోపాటు మార్కుల సర్టిఫికెట్, బోనఫైడ్ లేదా కండక్ట్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ జిరాక్స్ ప్రతులను 9440313745 నంబర్‌కు ఈ నెల 30వ తేదీ వరకు వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. గడువు లోగా అందిన దరఖాస్తులలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి నగదు, ప్రశంస పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. పురస్కారాలకు ఎంపికై న విద్యార్థుల వివరాలు, పురస్కారాలు ఇచ్చే తేదీ, వేదిక త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. వోపా అసోసియేట్ అధ్యక్షుడు పొడిచెట్టి విష్ణువర్ధన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం భిక్షపతి, కోశాధికారి శ్రీరామోజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
25 నుంచి పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఎల్‌ఐఎస్సీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25, 28, 30, ఆగస్టు 1, 4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు. పూర్తివివరాలకు సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

హత్య కేసులో నేరస్తుడికి పదేళ్ల జైలు

హత్య కేసులో నేరస్తుడికి పదేళ్ల జైలు

హత్య కేసులో నేరస్తుడికి పదేళ్ల జైలు