
19న కాజీపేటకు రైల్వేశాఖ మంత్రి
కాజీపేట రూరల్ : కాజీపేట మండలం మడికొండ శివారు పరిధి అయోధ్య పురంలో కేంద్ర ప్రభుత్వం సుమారు 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.786 కోట్ల వ్యయంతో జపాన్ టెక్నాలజీతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్ షెడ్ మల్టీపుల్ యూనిట్‌ను ఈ నెల 19వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తనిఖీ చేయనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన వ్యాగన్ షెడ్ నిర్మాణ పనుల్లో భాగంగా కోచ్‌ఫ్యాక్టరీని కూడా కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు కాజీపేటలో రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్‌షెడ్, వ్యాగన్ పీఓహెచ్ షెడ్‌గా అప్‌గ్రేడ్ చేసి మల్టీపుల్ రైల్వే ప్రాజెక్టు యూ నిట్‌గా విదేశీ టెక్నాలజీతో నిర్మిస్తోంది. ఇందులో కోచ్‌లు, వందేభారత్, మెమూ, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తయారవుతాయి. దాదాపు 70 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వ్యాగన్‌షెడ్, కోచ్‌ఫ్యాక్టరీ నిర్మా ణం పూర్తయితే ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అధికారికంగా కాజీ పేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్‌షెడ్‌లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ఇందులో భా గంగా కోచ్‌ఫ్యాక్టరీ నిర్మాణ పనుల తనిఖీ కోసం రై ల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 19వ తేదీన కాజీపేట పర్యటన చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
17న దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్ జీఎం తనిఖీ..
కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్‌షెడ్ మల్టీపుల్ యూనిట్‌ను ఈ నెల 17వ తేదీన దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్ జనరల్ మేనేజర్ సందీప్ మథూర్ తనిఖీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 19వ తేదీన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పర్యటనకు ముందస్తుగా దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్ జీఎం 17న సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో తనిఖీ చేసుకుంటూ కాజీపేట జంక్షన్ చేరుకుంటారు. అనంతరం కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్‌షెడ్ నిర్మాణ స్థలానికి వెళ్లి నిర్మాణ పనులు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై చర్చిస్తారు.
మల్టీపుల్ యూనిట్ పనుల పరిశీలనకు
రానున్న మంత్రి అశ్విని వైష్ణవ్