
ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
ఖిలా వరంగల్: ప్రజాఉద్యమాల నిర్మాణంతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. మంగళవారం వరంగల్ శంభునిపేట జంక్షన్‌లోని ఆర్‌ఆర్ ఫంక్షన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అధ్యక్షతన జిల్లాస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామితోపాటు వందలాది మంది కార్యకర్తలకు కండువాలు కప్పి మాట్లాడారు. కమ్యూనిస్టులు, ప్రజా ఉద్యమాలను బలహీనపర్చాలని పాలకులు అన్ని విధాలా కుట్రలు చేస్తున్నారన్నారు. నిర్భందాలు విధించి కుట్రతో కేసులు పెడుతున్నారన్నారు. సమాజంలో దోపిడీ ఉన్నంత కాలం ఎర్రజెండా ఉద్యమాలు ఉంటాయని పేర్కొన్నారు. దోపిడీ వర్గాల ఐక్యత కమ్యూనిస్టుల మధ్య లేకపోవడం పాలకులకు వరంగా మారిందన్నారు. ఈ క్రమంలో ఎంసీపీఐ(యూ).. కమ్యూనిస్టుల ఐక్యతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, కార్యకర్తల్లో లోటుపాట్లను సరి చేసి సరైన దృక్పథంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, వల్లపు ఉపేందర్‌రెడ్డి, గోనె కుమారస్వామి, ఎన్‌రెడ్డి హంసారెడ్డి, మంద రవి, నర్ర ప్రతాప్, కన్నం వెంకన్న, వంగల రాగ సుధ, కనకం సంధ్య, మాలోత్ ప్రత్యూష, గణిపాక ఓదెలు, మహమ్మద్ అబ్బు, తాటికాయల రత్న, దాసు, మాధవి, రామస్వామి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్