
తపాలా ఆధునికీకరణ..
ఖిలా వరంగల్: పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆధునికీకరణ దిశగా మరో ముందు అడుగు వేసింది. జూలై 22వ తేదీ నుంచి వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో అన్ని తపాలా కార్యాలయాల్లో ఐటీ–2.0 సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సూపరింటెండెంట్ బి. రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నూతన సాంకేతికతను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే నల్లగొండ డివిజన్‌లో జూలై 8వ తేదీన ప్రారంభించారని, ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఈనెల 22న తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతమున్న 2 హెడ్ పోస్టాఫీస్‌లు, 42 సబ్ పోస్టాఫీస్‌ల్లో ఈనూతన సాంకేతికతను అమలు చేయనున్నామని తెలిపారు. పార్సిల్, సీఓడీ, వీపీపీ వంవ సేవల బట్వాడ వేగవంతం అవుతుందని, డిజిటల్ సిగ్నేచర్, డిజిటల్ మోడ్ చెల్లింపులు వంటి ఆధునిక సదుపాయాలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈక్రమంలో జూలై 18,19 తేదీల్లో ఆన్‌లైన్ నమోదు పనులు, 21న పూర్తి స్థాయిలో లావాదేవీలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, ఖాతాదారులు తమ తపాలా లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ మార్పు వల్ల తాత్కాలికంగా కొన్ని అసౌకర్యాలు కలగొచ్చునని, అయితే వాటిని సమర్థవంతంగా అధిగమించి మెరుగైన సేవలు అందించేందుకు ఇది ముందడుగని రవికుమార్ తెలిపారు.
22న ఐటీ–2.0 సాంకేతికత ప్రారంభం
వేగవంతం కానున్న బట్వాడ సేవలు