
ప్రజల చైతన్యంతోనే ఆర్థిక వ్యవస్థ బాగు
హన్మకొండ: ప్రజల చైతన్యం, రాజకీయ వ్యవస్థలో మార్పుతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగు పడుతుందని, రాష్ట్ర సమగ్రాభివద్ధి సాధ్యమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్ట హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో ‘అప్పుల ఊబిలో తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ– కారణాలు, పర్యవసానాలు–ప్రస్తుత పరిష్కారాలు’ అనే అంశంపై మేధావుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో హరగోపాల్ ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో గత పాలకుల విధానాల వల్ల విద్య, వైద్యం లాంటి మౌలిక రంగాలు నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల రాజకీయ చైతన్యంతో, రాజకీయ పార్టీల స్వభావంలో మార్పుతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడి సమగ్రాభివద్ధి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ మేధావుల సూచనలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఎవరి మాట వినలేదన్నారు. నేటి పాలకులు మేధావుల సూచనలు విన్నప్పటికి వాటి అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ అన్ని రకాలుగా ఆగమైన వర్గాలకు న్యాయం జరగాల్సిన అవసరముందన్నారు. దొరల పాలనలో తెలంగాణ మరింత ఆగమైందని, మానవాభివృద్ధితో కూడిన ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచించి అమలుపరచాలన్నారు. ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినా కానీ ప్రజల మౌలిక సదుపాయాలు పెరగలేదన్నారు. హెదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్.వి.రమణమూర్తి మాట్లాడుతూ పంటల విధానంలో మార్పులు తెచ్చి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇట్యాల పురుషోత్తం, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామ్మూర్తి, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, డాక్టర్ జిలకర శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్ మోహన్ రావు ప్రసంగించారు. కార్యక్రమంలో వీరమల్ల బాబురావు, మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, సుశీల, చాపర్తి కుమార్ గాడ్గే, డాక్టర్ ప్రవీణ్ కుమార్, బుసిగొండ ఓంకార్, వల్లాల జగన్ గౌడ్, సంఘని మల్లేశ్వర్, కొంగ వీరస్వామి, మేకల కేదారి యాదవ్, నలిగింటి చంద్రమౌళి, లంకా పాపిరెడ్డి, బొమ్మినేని పాపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గత పాలకుల విధానాలతో
విద్య, వైద్య రంగాలు నాశనం
ప్రొఫెసర్ హరగోపాల్