
అమెరికా స్వప్రయోజనాల కోసమే యుద్ధాలు
● టీఎస్‌డీఎఫ్ రాష్ట్ర సదస్సులో వక్తలు
న్యూశాయంపేట: అమెరికా స్వప్రయోజనాల కోసం జరుగుతున్న యుద్ధాలతో సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని వక్తలు పేర్కొన్నారు. ‘యుద్ధాలు ఎవరి కోసం’ అనే అంశంపై తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీఎస్‌డీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయకరెడ్డి అధ్యక్షతన ఆదివారం వరంగల్ అబ్నూస్ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ అధికార ప్రతినిధి జేవీ చలపతిరావు, సీపీఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయ్‌కుమార్ మాట్లాడారు. ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించేందుకు, సంపద దోచుకునేందుకు దేశాల మధ్య అమెరికా యుద్ధాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రాణాలు పోతున్నాయని, పర్యావరణం దెబ్బతింటున్నదని పేర్కొన్నారు. కోలుకోలేని విధంగా గాజా, ఇరాన్, పాలస్తీనా దేశాలు దెబ్బతిన్నాయని, అభంశుభం తెలియని పసికందులు, మహిళలు సైతం ప్రాణాలు కోల్పోయారన్నారు. అమెరికాకు భారత్ వత్తాసు పలకడం సిగ్గుచేటని, పాకిస్తాన్‌తో సయోధ్య కుదిర్చామని గొప్పలు చెబుతున్న ట్రంప్ ఇతర దేశాల మధ్య చిచ్చు ఎందుకు ఆపడం లేదని ప్రశించారు. అమెరికా ప్రయోజనాల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం ప్రధాని మోదీ సాగిల పడడం ఆందోళన కలిగిస్తోందని వారు పేర్కొన్నారు. ఇప్పటికై నా అలాంటి ధోర ణి మానుకోవాలని హెచ్చరించారు. దోపిడీ లేని రాజ్యం కోసం ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో నాయకులు పి.రమేశ్, ఎం.రవి, విశ్వనాఽథ్, ఆర్.బాలరాజు, ఎన్.అప్పారావు, యాదగిరి, ఇనాం అబ్దుల్‌అలీ జుబేర్, అబ్దుల్ సుభాన్, వి.రాగసుధ, జి.నాగార్జున, సావిత్రి, తదితర నాయకులు పాల్గొన్నారు.