
కమ్యూనిస్టులు లేకుండా చేయలేరు
కురవి: కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరితరం కాదని, అడాల్ఫ్ హిట్లర్ వల్లే సాధ్యం కాలేదు.. అమిత్‌షా వల్ల ఏం అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండల కేంద్రంలోని ఎండీ లియాఖత్ అలీ, సురేందర్‌కుమార్ ప్రాంగణంలో మహబూబాబాద్ జిల్లా సీపీఐ మూడో మహాసభలో కూనంనేని మాట్లాడారు. కమ్యూనిజం లేకుండా చేయడం ఎవరితరం కాదని, మానవ సమాజం, ఈ భూమి ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ కగార్ పేరిట అడవుల్లో ఉన్న కమ్యూనిస్టులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతం చేస్తానని చెప్పి నంబాల కేశవరావును హత్య చేశారని వెల్లడించారు. మావోయిస్టులు మా వాల్లేనని, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎర్రజెండా పట్టుకున్న ప్రతీ ఒక్కరు తమ వాల్లేనని పేర్కొన్నారు. బందిపోట్లు ప్రజల్లో ఉండి తిరుగుతున్నారని, మావోయిస్టులు ఆయుధాలను పక్కన పెట్టే దిశగా ఆలోచన చేయాలని సూచించారు. వేర్వేరుగా ఉన్న ఎర్రజెండా పార్టీలన్ని ఒక్కతాటిపై రావాల్సిన అవసరం ఉందని, ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరాలని కోరారు. డిసెంబర్ 26న ఖమ్మంలో సీపీఐ వందేళ్ల పండుగ చేస్తున్నామని చెప్పారు.
ఎన్నికల వరకే పొత్తులు..
ఎన్నికల వరకే పొత్తులుంటాయని, ప్రజాసమస్యలను విస్మరిస్తే చూస్తూ ఊరుకోమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోటను విస్మరిస్తే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విజయసారథి, సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, అజయ్‌సారథి, కట్టెబోయిన శ్రీనివాస్, కరణం రాజన్న, నెల్లూరి నాగేశ్వర్‌రావు, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, వరిపెల్లి వెంకన్న, నవీన్, బాలకృష్ణ, తురక రమేష్, బుర్ర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కమ్యూనిస్టులు ఏకతాటిపై రావాలి

కమ్యూనిస్టులు లేకుండా చేయలేరు