
‘స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేది లేదు’
మరిపెడ: స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేది లేదని మహబూబాబాద్ డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కాంప్లెక్స్‌లో శంకర్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని రవిరాథోడ్ సీజ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హై డోస్ వాడితే భవిష్యత్‌లో అనారోగ్యం బారిన పడతారన్నారు. అనుమతి లేకుండా వైద్యం చేయడం చట్టరీత్యా నేరమని, ప్రాక్టీషనర్లు పరిమితులకు లోబడి చికిత్స చేయాలని సూచించారు. జిల్లాలో అధికంగా మరిపెడలో అర్హత లేని వైద్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తనిఖీలు చేస్తున్నారనే సమాచారంతో మిగతా ప్రథమ చికిత్స కేంద్రాల నిర్వాహకులు షెట్టర్లకు తాళాలు వేసుకుని పరారయ్యారన్నారు. అయినప్పటికీ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌ఓ వెంట స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి గుగులోతు రవికుమార్ తదితరులున్నారు.
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
డోర్నకల్: డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డోర్నకల్ సీఐ బి.రాజేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇస్లావత్ నవీన్ ఓ తండాకు చెందిన బాలికను ఇంటి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. బాలిక అదృశ్యంపై ఆమె అమ్మమ్మ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం నవీన్ పది రోజుల తర్వాత బాలికను స్వగ్రామానికి తీసుకొచ్చాడు. పోక్సో కేసు నమోదు చేసి నవీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.
చోరీ చేసేందుకు వచ్చిన బిహార్ యువకుడికి దేహశుద్ధి
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని బుక్క బజార్ ప్రాంతంలోని బ్రహ్మణపల్లి సురేశ్ ఇంట్లోకి శుక్రవారం బిహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు ప్రవేశించాడు. బీరువా తెరిచి చోరీకి చేసేందుకు యత్నించాడు. ఏదో శబ్ధం అవుతున్నట్లుగా అలికిడి వినిపించడంతో వెంటనే ఆ ఇంటి యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి అరిచాడు. స్థానికులు వచ్చి ఆ యువకుడిని కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
కేజీబీవీలో రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలి
మహబూబాబాద్ అర్బన్: కేజీబీవీల్లో రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్‌ను టీపీటీఎఫ్ నాయకులు శుక్రవారం సందర్శించి సభ్యత్వ నమెదు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యదర్శి రాచకొండ ఉపేందర్, మండల అధ్యక్షుడు భిక్షపతి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
నెల్లికుదురు: నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేయాలనే కుట్ర చేసి పేదలకు దక్కకుండా చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎం మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఇస్సంపల్లి సైదులు, బాబు గౌడ్, నర్సయ్య, యాకయ్య, పుల్లయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు.

‘స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేది లేదు’

‘స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేది లేదు’