
పథకాలను వేగవంతంగా అమలు చేయాలి
హన్మకొండ: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేయాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి అన్నారు. పథకాల అమలు వేగవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఉమ్మడి జిల్లాల వారీగా సూపర్‌వైజర్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ క్రమంలో సంగీత లక్ష్మి హనుమకొండలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానాకాలం పూర్తయ్యేలోపు మూడు నెలల్లో ఆయిల్ పాం తోటల పెంపకంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా ఇతర తోటల పెంపకాన్ని పూర్తి చేయాలని, సూక్ష్య సేద్యపు పరికరాల బిగింపు పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఇక నుంచి ప్రతీ వారం సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా నివేదికను వ్యవసాయ శాఖ మంత్రికి అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ డీహెచ్‌ఎస్‌ఓలు జి.అనసూయ, ఆర్.శ్రీనివాసరావు, మిరయన్న, శ్రీధర్‌రావు, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.
వానాకాలంలోపు
తోటల పెంపకం పూర్తి చేయాలి
ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్
సంగీత లక్ష్మి