బీపీఈడీలో రైతుబిడ్డకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్
ఏటూరునాగారం: బీపీఈడీలో రైతుబిడ్డ సత్తా చాటింది. టీజీ పీఈసీఈటీ–2025 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరుకు చెందిన రైతు రామయ్య, కుమారి దంపతుల కూతురు జ్యోతిర్మయి ఈ నెల 13వ తేదీన టీజీ పీఈసీఈటీ–2025 (తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రాసింది. ఈ క్రమంలో మంగళవారం విడుదలైన ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. దీంతో తల్లిదండ్రులు రామయ్య, కుమారి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, జ్యోతిర్మయి రొయ్యూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ 5వ తరగతిలో రాయపర్తి సోషల్ వెల్ఫేర్ గురుకులంలో సీటు సాధించింది. ఐదు నుంచి ఇంటర్ వరకు అక్కడే చదువుకుంది. అయితే క్రీడలపై మక్కువతో 9వ తరగతిలో రంగారెడ్డి జిల్లా కమ్మదను సోషల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ అకాడమీలో కోచ్ హబీద్ హుస్సేన్ వద్ద శిక్షణ తీసుకుంది. అనంతరం పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవల బీపీఈడీ (వ్యాయామ) ప్రవేశ పరీక్ష రాసింది. ఇందులో స్టేట్ ర్యాంక్‌ను సాధించింది. కాగా, బీపీఈడీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు సంతోషంగా ఉందని జ్యోతిర్మయి తెలిపింది.
క్రీడల్లో ప్రతిభ కనబర్చిన జ్యోతిర్మయి
తల్లిదండ్రులు, గ్రామస్తుల హర్షం


