
రిటైర్డ్ ఉద్యోగుల ఇబ్బందులు
● పదవీ విరమణ పొంది ఏడాదైనా అందని బెనిఫిట్స్
● రిటైర్మెంట్ డబ్బులపై పెట్టుకున్న ఆశలు గల్లంతు
● ఇంట్లో ఒత్తిడి పెరగడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
● తమ డబ్బులు త్వరగా ఇవ్వాలని వేడుకోలు
‘జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన కూతురు వివాహం కుదుర్చుకున్నాడు. కట్నం డబ్బుల్లో సంగం పెళ్లి సమయంలో ఇవ్వడం, మిగిలినవి రిటైర్డ్ డబ్బులు రాగానే ఇస్తామని అంగీకారం కుదుర్చుకున్నాడు. ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ఆ ఉద్యోగి ఆరు నెలల క్రితంపదవీ విరమణ పొందాడు. ఇప్పటికీ డబ్బులు రాకపోవడంతో.. అత్తింటి నుంచి కూతురుకు వేధింపులు మొదలయ్యాయి.’
సాక్షి, మహబూబాబాద్: పదవీ విరమణ పొంది ఏడాది గడిచినా తమకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, జిల్లా ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు 8,094, పదవీ విరమణ పొందిన వారు 2,635 మంది మహబూబాబాద్, గూడూరు, మరిపెడ ట్రెజరీ కార్యాలయాల ద్వారా వేతనాలు, పెన్షన్లు పొందుతున్నారు. ఇందులో ఏడాది క్రితం పదవీ విరమణ పొందిన వారు 100 మందికి పైగా ఉంటారు. వీరిలో కొందరికి పెన్షన్ వచ్చినా.. ఇతర బెన్‌ఫిట్స్ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు.
రూ. 50లక్షలకు పైగా..
ఉద్యోగంలో చేరిన నాటినుంచి ప్రభుత్వ ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి ప్రతీ నెల కొంత కటింగ్ పెట్టుకుంటారు. గ్రూపు ఇన్సూరెన్స్, తెలంగాణ రాష్ట్ర గ్రూపు లైఫ్ ఇన్సూరెన్స్, జీపీఎఫ్, కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్(సీవీపీ), గ్రాట్యుటీ మొదలైన వాటి ద్వారా వేతనంలో కొంత డబ్బును పొదుపు చేసుకుంటారు. ప్రభుత్వం కొంత కలిపి రిటైర్మెంట్ తర్వాత సదరు ఉద్యోగికి చెల్లించాలి. వీటితోపాటు ఉద్యోగి సలెండర్ లీవ్స్‌కు కూడా వెలకట్టి రిటైర్మెంట్ తర్వాత చెల్లించాలి. ఇలా ప్రతీ రిటైర్డ్ ఉద్యోగికి వారిస్థాయిని బట్టి రూ.50లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.
అంతా తారుమారు..
పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే డబ్బులకోసం వేసుకున్న ప్రణాళిక అంతా తారుమారు అయ్యిందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం, నిరుద్యోగులైన కుమారులకు ప్రైవేట్ వ్యాపారం పెట్టించడం, చివరకు భార్యకు బంగారం కొనడం వంటి ఆశలు పెట్టుకున్నారు. అయితే పదవీ విరమణ అందరి సమక్షంలో అట్టహాసంగా చేసుకొని బంధువుల ముందు డబ్బులు ఇస్తామని చెప్పామని, ఇప్పుడు సకాలంలో డబ్బులు రాకపోవడంతో మాట తప్పాల్సి వచ్చిందని ఉద్యోగులు అంటున్నారు.
పదవీ విరమణ రోజే డబ్బులు ఇవ్వాలి
ఉద్యోగి పనిచేసిన కాలంలో మూల వేతనం నుంచి కటింగ్ పెట్టుకొని దాచుకున్న డబ్బులు, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్‌ను ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజే ఇవ్వాలి. అలా కాకుండా జాప్యం చేయడం వల్ల డబ్బులకోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
–సంకా బద్రినారాయణ,
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
ట్రెజరీ ఉద్యోగులు పెన్షనర్లు
మహబూబాబాద్ 5,361 1,798
మరిపెడ 1,602 601
గూడూరు 1,131 236
మొత్తం 8,094 2,635

రిటైర్డ్ ఉద్యోగుల ఇబ్బందులు

రిటైర్డ్ ఉద్యోగుల ఇబ్బందులు