
కలెక్టరేట్‌లో భగీరథ మహర్షి జయంతి
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి రైతు
అవగాహన సదస్సులు
మహబూబాబాద్ రూరల్: ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 5నుంచి జూన్ 13వ తేదీ వరకు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్.మాలతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల ఆదివారం తెలిపారు. ఈమేరకు మొదటి రోజు సోమవారం మహబూబాబాద్ రైతు వేదికలో వివిధ అంశాలపై రైతులకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. 6న కురవి, 7న గూడూరు. 12న నెల్లికుదురు, 13న సీరోలు మండలం కాంపల్లి, 16న డోర్నకల్, 17న కేసముద్రం, 20న కేసముద్రం మండలం కల్వల, 23న గార్ల, 24న కొత్తగూడ, 27న బయ్యారం, 30న కురవి మండలం మొగిలిచర్ల, 31న గంగారం, జూన్ 3న మరిపెడ, 5న దంతాలపల్లి, 10న ఇనుగుర్తి, 12న నెల్లికుదురు, 13న నర్సింహులపేటలో రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్.మాలతి, శాస్త్రవేత్తలు ఎన్.కిషోర్ కుమార్, ఈ.రాంబాబు, బి.క్రాంతికుమార్ వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొని రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
ఒకటే టికెట్ కౌంటర్..
ప్రయాణికుల పాట్లు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్ ఫాం వైపున గల భవనంలో బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే అందులో ఒక కౌంటర్ ద్వారా మాత్రమే ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నారు. ఈక్రమంలో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో క్యూలో ఉండడం, టికెట్ తీసుకునేందుకు ఆలస్యమవుతుండంతో రైళ్లు మిస్ అవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. పలు సందర్భాల్లో టికెట్ లేకుండానే రైళ్లు ఎక్కి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైల్వేశాఖ అధికారులు స్పందించి సీ్త్రలు, పురుషులకు వేర్వేరుగా టికెట్ బుకింగ్ కౌంటర్లు పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సార్వత్రిక సమ్మెకు సహకరించాలి
తొర్రూరు: ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెకు అన్ని వర్గాలు సహకరించాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఓమ బిక్షపతి, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి అన్నారు. ఈ మేరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్‌కు నోటీసులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు జమ్ముల శ్రీను, శ్రీరాం పుల్లయ్య పాల్గొన్నారు.
సరస్వతి అమ్మవారి
విగ్రహం వచ్చేసింది..
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరానికి తమిళనాడులోని మహాబలిపురం నుంచి లారీలో సరస్వతి అమ్మవారి విగ్రహం, నాలుగు వేదమూర్తుల విగ్రహాలు ఆదివారం సాయంత్రం వచ్చాయి. కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతినది పుష్కరాల కోసం త్రివేణి సంగమ తీరంపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.కోటితో బేస్‌మెంట్‌స్టాండ్ నిర్మాణం, విగ్రహ తయారీ పనులు చేపట్టారు. సోమవారం విగ్రహాన్ని కాంక్రీటు బేస్‌మెంట్ స్టాండ్‌పై ఇన్‌స్టాల్ చేయనున్నారు. అమ్మవారి విగ్రహం చుట్టూర వేదమూర్తులను ఆసీనులు చేస్తారు. తరువాత లాన్, ఇతర సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.