
కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చాం
మహబూబాబాద్ రూరల్: కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ పరిశీలకురాలు కూచన రవళిరెడ్డి, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మానుకోటలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా సంస్థాగత, నిర్మాణ సన్నాహక సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పార్టీ బలంగా ఉంటేనే కార్యకర్తలు బలంగా ఉంటారని, నాయకులైనా, కార్యకర్తలైనా పార్టీని ఇబ్బంది పెట్టేవిధంగా వ్యవహరించకూడదని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని, అప్పుడే సరైన నాయకత్వానికి అవకాశం ఉంటుందన్నారు. సిఫార్సుల ద్వారా, నామినేటెడ్‌గా పదవులు ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమక్షంలో సమావేశాలు నిర్వహించి అర్హతను బట్టి పదవులు కేటాయించాలని సూచించారు. ఒక నియమావళిని రూపొందించి దానికి అనుగుణంగా కమిటీలు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, టీపీసీసీ పరిశీలకుడు నాగేశ్వర్‌రావు, టీపీసీసీ ప్రధా న కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీపీసీసీ పరిశీలకురాలు రవళిరెడ్డి, ఎమ్మెల్యే మురళీనాయక్