పెన్షనర్ల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి
కర్నూలు(సెంట్రల్): పదవీ విరమణ చేసి పెన్షన్‌పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న పెన్షనర్ల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జీఎస్ అబ్దుల్ కరీం, ఎ.మద్దులేటి డిమాండ్ చేశారు. గురువారం కోర్టు ఆవరణలోని యునైటెడ్ క్లబ్‌లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా సమావేశాలు నిర్వహించారు. ముందుగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. కోట్ల లింగన్న, జాకబ్ ప్యానళ్లు పోటీ పడగా మూజువాణి పద్ధతిలో అత్యధిక మంది కోట్ల లింగన్న ప్యానెల్‌కు మద్దతు తెలపడంతో విజయం సాధించినట్లు ప్రకటించారు. ఆ ప్యానెల్‌కు కోట్ల లింగన్న జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా తూము శివారెడ్డి, ట్రెజరర్‌గా మీసాల మాసుమన్నతోపాటు వివిధ పదవులకు అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28లోపు పెన్షనర్ల జీవన ప్రమాణ పత్రాలను డిజిటల్ రూపంలో సమర్పించాలని సూచించారు. పెన్షనర్లకు రావాల్సిన బకాయిల విడుదలపై రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకస్తామన్నారు. పదవీ విరమణ పొందిన రోజే బెనిఫిట్స్ రావాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. జిల్లా నూతన అధ్యక్షుడు కోట్ల లింగన్న మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ట్రెజరీ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.


