ఆధునిక సాంకేతికతతో రోడ్ల నాణ్యత
వరంగల్ నిట్ ప్రొఫెసర్
కర్నూలు(అర్బన్): రోడ్ల నిర్మాణాల్లో ఆధునిక సాంకేతికతను అవలంబించడంతో చాలా ఏళ్ల వరకు అవి నాణ్యతగా ఉంటున్నాయని వరంగల్ నిట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శంకర్ అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై ) ప్రారంభించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీరాజ్ ఇంజినీర్లకు పీఎంజీఎస్‌వై రోడ్ల నిర్మాణం, నాణ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణాల్లో పాత పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక సాంకేతికతతో నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. రోడ్ల నాణ్యతపై నిట్ అధ్వర్యంలో నూతన టెక్నాలజీపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఆయా పరిశోధనలను త్వరలో రోడ్ల నిర్మాణాల్లో ఉపయోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదన్నారు. ముఖ్యంగా పీఎంజీఎస్‌వై కింద చేపడుతున్న గ్రామీణ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. రోడ్లు పనులు ప్రారంభించినప్పటి నుంచి పూర్తి అయ్యేంత వరకు ఇంజినీర్ల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎక్కడ చిన్న పాటి అశ్రద్ధ వహించినా, నష్టం జరిగే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్ల నాణ్యతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన అనేక విషయాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో పీఆర్ పర్యవేక్షక ఇంజనీరు ఐ వేణుగోపాల్, ఈఈలు మహేశ్వరరెడ్డి, రఘురామిరెడ్డి, డీసీ వెంకటేష్, జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లు సౌజన్య, సుస్మిత, డీఈఈలు బండారు శ్రీనివాసులు, నాగిరెడ్డి, చంద్రశేఖర్, కర్రెన్న, మోహన్‌రావు, రాణి, భాస్కర్‌రెడ్డి, ధనిబాబు, మన్మధబాబు, ఏఈఈలు ఆర్ సతీష్‌కుమార్, అమర్‌నాథ్, రమణ, మోహన్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ ఎస్. శంకర్


