ఎన్‌హెచ్–40పై హైఅలర్ట్
కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
కర్నూలు: పొగ మంచు కారణంగా వాహనదారులకు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) హై అలర్ట్ ప్రకటించింది. రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు–కడప జాతీయ రహదారి (ఎన్‌హెచ్–40)పై శీతాకాలం సవాలు విసురుతోంది. 188 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రస్తుతం పొగ మంచు (వైట్ ఔట్) వల్ల ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 9 గంటల వరకు దృశ్యమానత (విజిబులిటీ) సున్నాకి పడిపోతుండటంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల సంస్థ హై అలర్ట్ ప్రకటించింది. ప్రమాదాలకు కారణమవుతున్న ఇల్యూజన్ (భ్రమ) సాధారణంగా పొగ మంచులో డ్రైవర్లు తమ వాహనం నెమ్మదిగా వెళ్తుందని భావిస్తారు. వాస్తవానికి వాహనం వేగంగానే ఉంటుంది. దీనిని స్పీడ్ ఇల్యూజన్ అని పిలుస్తారు. ఈ భ్రమ వల్లనే ఎక్స్‌ప్రెస్ వేలపై గొలుసుకట్టు ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అత్యవసర సహాయం కోసం 1033...
ప్రయాణంలో వాహనం మొరాయించినా లేదా రోడ్డుపై ఏదైనా అవరోధం ఉన్నా వెంటనే జాతీయ రహదారి హెల్ప్‌లైన్ 1033కి డయల్ చేయాలి. పొగమంచు సమయంలో ఓపికగా, నెమ్మదిగా డ్రైవ్ చేయాలని జాతీయ రహదారుల సంస్థ ఎన్‌హెచ్‌ఐఏ ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాహనదారులు 10 నుంచి 15 మీటర్ల దూరం పాటించాలి.
పొగ మంచు తీవ్రత దృష్ట్యా ఎన్‌హెచ్–40పై జాతీ య రహదారుల సంస్థ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం కెమెరా ల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ జరుగుతోంది. నన్నూరు, చాపిరేవుల, చాగలమర్రి, పాటిమీద పల్లి టోల్‌ప్లాజాల నుంచి పెట్రోలింగ్ వాహనా లు నిరంతరం సైరన్‌లతో తిరుగుతూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నాయి. ప్రమాదకరమైన మలుపుల వద్ద సోలార్ బ్లింకర్లు, మెరిసే సైన్ బోర్డులను అదనంగా ఏర్పాటు చేశాం.
– వి.మదన్‌మోహన్, ప్రాజెక్ట్ హెడ్


