యువతి కిడ్నాప్‌నకు విఫల యత్నం
కల్లూరు: నగరంలోని ఓ కాలనీకి చెందిన యువతి ( 23 )ని కిడ్నాప్ చేసేందుకు నలుగురు ప్రయత్నించి విఫలమయ్యారు. ఉలిందకొండ ఎస్‌ఐ ధనుంజయ తెలిపిన మేరకు వివరాలు... ఆదివారం దూపాడు సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం టెట్ పరీక్ష రాసేందుకు యువతి తల్లిదండ్రులుతో కలిసి వచ్చింది. ఈమెను డోన్ పట్టణానికి చెందిన హర్ష, మరో ముగ్గురుతో కలిసి కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలోనే యువతి తల్లిదండ్రులు, స్థానికులు అడ్డుకోవడంతో ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
లారీ బోల్తా
కొత్తపల్లి: వరి ధాన్యం లోడుతో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడిన ఘటన గువ్వలకుంట వద్ద చోటు చేసుకుంది. ఖరీఫ్ సీజన్ పూర్తి కావడంతో రైతులు వారి ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారు. ఆ ధాన్యాన్ని పంట పొలాల్లో నుంచి ఓ లారీలో తరలించేందుకు సిద్ధం చేసుకున్నారు. రైతుల వద్ద నుంచి సుమారు 340 బస్తాలతో లోడ్ చేశారు. పొలాల్లో నుంచి వరి ధాన్యం లోడుతో వస్తున్న లారీ ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కన ఉన్న పుట్టను వెనక చక్రాలు ఎక్కడంతో బోల్తా పడింది. తేరుకున్న డ్రైవర్ చాకచక్యంగా బయటికి దూకాడు. ఆ సమయంలో రైతులు కూడా ఎవరూ లేకపోడంతో ప్రాణనష్టం తప్పింది.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
పత్తికొండ: దాడిలో గాయపడిన గొల్ల లింగమూర్తి చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. భైరవాణికుంట గ్రామానికి చెందిన గొల్ల లింగమూర్తి నేలతలమర్రి గ్రామానికి చెందిన రంగమ్మతో చనువుగా ఉన్నట్లు భర్త నాగేంద్ర అనుమానించాడు. ఈ విషయంలో ఇరువురు మధ్య గొడవ జరగడంతో రంగమ్మ రెండు నెలల నుంచి పత్తికొండ పట్టణంలో ఉంటుంది. నాలుగు రోజుల క్రితం లింగమూర్తి ఆమె ఇంటి వద్దకు రాగా అక్కడే మాటు వేసిన నాగేంద్ర కుటుంబసభ్యులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లింగమూర్తి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కోలుకోలేక మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి తండ్రి గొల్ల చిన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ జయన్న తెలిపారు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నేడు డయల్ యువర్ సీఎండీ
కర్నూలు(అగ్రికల్చర్): తిరుపతిలోని ఏపీఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఈ నెల 15 తేదీన డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు. వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ఫోన్ ద్వారా తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 8977716661 నెంబరుకు ఫోన్‌చేసి సమస్యల గురించి చెప్పవచ్చన్నారు.
వివాహిత ఆత్మహత్య
రుద్రవరం: మండల పరిధిలోని తువ్వపల్లెకు చెందిన వెంకటచంద్రుడు భార్య వరాలు (44) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లి లచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్‌ఐ బాలన్న తెలిపారు.
నాలుగేళ్ల తర్వాత ఇంటికి..
కొత్తపల్లి: నాలుగేళ్ల క్రితం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని పోలీసులు క్షేమంగా ఇంటికి చేర్చారు. ఎస్‌ఐ జయ శేఖర్ తెలిపిన వివరాల మేరకు.. గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన మురుగేశ వెంకటేశ్వర్లు అనే యువకుడు ఊర్లో అప్పులు చేసి 2021 నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పట్లో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లి రవణమ్మ, సోదరులు ఆందోళన చెందుతూ వచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఆదివారం స్టేషన్‌కు తీసుకొచ్చి ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి సమక్షంలో అతని తల్లికి అప్పగించారు.
యువతి కిడ్నాప్‌నకు విఫల యత్నం
యువతి కిడ్నాప్‌నకు విఫల యత్నం


