హైదరాబాద్‌లో కేసులున్నా ఇక్కడ ఎమ్మెల్యేనే!
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓ ప్రధాన నియోజకవర్గంలో భార్య, భర్త, కూతురు ఇలా అందరూ ఒకరి తరువాత ఒకరు ఎమ్మెల్యేలుగా పని చేశారని, హైదరాబాద్‌లో కేసులున్నా ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, ఇతర సామాజిక వర్గాలకు ఎందుకు అవకాశం ఇవ్వరని అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ప్రశ్నించారు. ఆదివారం బాంసెఫ్ (వెనుకబడిన తరగతుల కులాలకు అతీతంగా జాతీయ స్థాయిలో ఏర్పడిన సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రవర్ణాల పెత్తనమే కొనసాగుతోందన్నారు. ఓట్లు మనవే అయినప్పుడు అధికారం కూడా మనదే కావాలని, అందుకు కలిసికట్టుగా ముందుకు సాగడంతో పాటు పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏడుగురు రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉండగా, ముగ్గురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకరు మైనార్టీ వర్గానికి చెందిన వారు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. మాజీ ఎంపీ సంజీవ్‌కుమార్, బాంసెఫ్ నాయకులు డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ నిరంజన్, టి. శేషఫణి, పట్నం రాజేశ్వరి, ఎం. ఖదీరుల్లా మాట్లాడుతూ 75 ఏళ్లుగా దేశంలో కులగణన చేపట్టకుండా పాలకులు నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వామన్ మేశ్రమ్ రచించిన ‘ఈవీఎంల ద్వారా భారతదేశంలో హత్య కావించబడిన ప్రజాస్వామ్యం’ అనే పుస్తకంతో పాటు ఏఐబీఎస్పీ ఆధ్వర్యంలో ముద్రించిన ‘కులాంధ్రప్రదేశ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ మహాసభలకు పలు జిల్లాల నుంచి ఓబీసీ ప్రతినిధులు, బాంసెఫ్ నాయకులు హాజరయ్యారు.
భార్య, భర్త, కూతురు అంతా వారే..
నియోజకవర్గం వాళ్లకు
రాసిచ్చేశారా ?
ఇతర సామాజిక వర్గాలకు ఎందుకు
అవకాశం ఇవ్వరు?
ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త
పూర్ణచంద్రరావు


