ఫాస్టాగ్ లేకపోయినా స్మార్ట్ టోల్ సిస్టమ్
కర్నూలు: ఫాస్టాగ్ లేకపోతే ఇకపై టోల్ ప్లాజాల్లో డబుల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ లేకుండా ప్రయాణించే వాహనదారులు ఇప్పటివరకు టోల్‌ప్లాజాలో క్యాష్ (నగదు) చెల్లిస్తే డబుల్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఉదాహరణకు రూ.100 టోల్ ఉన్న చోట ఫాస్టాగ్ ఉంటే రూ.100, లేకపోతే నగదు రూ.200 వసూలు చేసేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం యూపీఐ ద్వారా చెల్లిస్తే కేవలం 25 శాతం అదనంగా మాత్రమే అంటే రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నిబంధన ఈనెల 16వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
ట్రాఫిక్ నియంత్రణ కోసం..
యూపీఐ చెల్లింపుల ద్వారా టోల్ ఫీజు చెల్లించడం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గి రాకపోకలు సాఫీగా సాగుతాయి. నగదు లావాదేవీల్లో ఉండే అవినీతి, ఆలస్యం కూడా తగ్గుతుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఈ మేరకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆమోద పత్రం జారీ చేసింది. ఇకపై కర్నూలు–కడప జాతీయ రహదారి (ఎన్‌హెచ్40)లోని టోల్ ప్లాజాల్లో స్టాటిక్ క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపు విధానం అమలు చేయనున్నారు. దీనివల్ల వాహనదారులకు ఫాస్టాగ్ లేకపోయినా సులభంగా క్యూఆర్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
కర్నూలు–కడప జాతీయ రహదారిపై క్యూఆర్ యూపీఐ టోల్ చెల్లింపు అమలు ప్రారంభం కావడం వేలాది వాహనదారులకు పెద్ద ఉపశమనం. వాహనదారులు టోల్ బూత్ వద్ద ఆగి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. నగదు చెల్లింపులతో పోలిస్తే ఇది తక్కువ ఖర్చు. ట్రాఫిక్ తగ్గింపుతో పాటు పారదర్శకత కూడా ఉంటుంది. డిజిటల్ లావాదేవీలతో టోల్‌ప్లాజాల్లో లైన్లు తగ్గి ట్రాఫిక్ కుదింపు, సమయం ఆదా అవుతుంది. – వి.మదనమోహన్,
ప్రాజెక్ట్ హెడ్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే
ఫాస్టాగ్ లేకపోయినా స్మార్ట్ టోల్ సిస్టమ్


