30లోపు పొగాకు కొనుగోలు ఒప్పందం
కర్నూలు(సెంట్రల్): పొగాకు పంటకు సంబంధించి రైతులతో కొనుగోలు ఒప్పందాన్ని ఈనెల 30వ తేదీలోపు కుదుర్చుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆయా కంపెనీలను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పొగాకు సంబంధించి జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..2025–26 సంవత్సరం రబీలో హెచ్‌డీ బీఆర్‌జీ, హెడీ బార్లీ, బ్లాక్ బెర్రీ రకాల పొగాకు సాగును పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. అందువల్ల అన్ని పొగాకు కంపెనీలు/ఎగుమతిదారులు వాటి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఒప్పందం చేసుకోరాదన్నారు. వైట్ బార్లీ రకం పొగాకు సాగుపై నియంత్రణ అమల్లో లేదని, రైతులు, పొగాకు కంపెనీలు కొనుగోలు ఒప్పందాన్ని కచ్చితంగా చేసుకోవాలని సూచించారు. పొగాకుకు సంబంధించి టాస్కుఫోర్సు కమిటీలు డివిజన్, మండల స్థాయిల్లో కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆయా కమిటీల్లో ఒక్క రైతు ఉండే విధంగా చూడాలన్నారు. ఫలితంగా రైతుల తరఫున సమస్యలను కమిటీ దృష్టికి తెస్తే పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్ పాల్గొన్నారు.


