చంద్రబాబువి చెత్త ఆలోచనలు
● ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి
మంత్రాలయం: సీఎం చంద్రబాబు నాయుడివి చెత్త ఆలోచనలు అని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. స్వార్థం కోసం ఇలాంటి కుట్రకు తెరతీయడం సబబు కాదన్నారు. మంగళవారం మంత్రాలయంలోని వాసవీ కల్యాణ మంటపంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నా కూటమి పాలకులల్లో ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సదాలోచనతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు పునాది రాళ్లు వేయగా అందులో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు.
గతాన్ని మరిచిపోవద్దు..
తాను పెట్టిన భిక్షతోనే టీడీపీ నేత రాఘవేంద్రరెడ్డి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు వచ్చిందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆయన తండ్రి రామిరెడ్డికి కేడీసీసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఎదిగారని గుర్తు చేశారు. రాఘవేంద్రరెడ్డి కుటుంబం గతాన్ని మరిచి వ్యవహరిస్తోందని పేర్కొ న్నారు. ఇలాంటోళ్లు ఎంతమంది పోటీకి వచ్చినా వచ్చే ఎన్నికల్లో ఐదోసారి తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల అండదండలు ఉన్నంత కాలం తనకు ఓటమంటూ లేదని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విశ్వనాథ్‌రెడ్డి, మండల కన్వీనర్ జి.భీమారెడ్డి, పార్టీ జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్ గురురాజారావు, సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచులు హోటల్ పరమేష్, వీరనాగుడు, వైస్ ఎంపీపీ రాఘవేంద్ర, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్‌శెట్టి, నాయకులు దశరథరెడ్డి, రోగప్ప, సూగూరు లక్ష్మయ్య, బొంబాయి శివ, వీరారెడ్డి, మదుసూధన్‌రెడ్డి, శంకర్, నరసింహులు, గోపిస్వామి తదితరులు పాల్గొన్నారు.
కోటి సంతకాలతో కూటమి మెడలు వంచుతాం
కూటమి ప్రభుత్వ మెడలు వంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీపీపీ విధానం రద్దుకు కోటి సంతకాల సేకరణ కార్యాచరణ చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం నుంచి లక్ష్యానికి మించి సంతకాలు సేకరిద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి 60 వేలకు పైగా సంతకాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే మంత్రాలయం నుంచి అధికంగా సంతకాలు సేకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పనులు అంతంత మాత్రమేనని, ప్రచారంలో మాత్రం ఆహా..ఓహో.. అని డప్పు కొట్టుకుంటోందని వై.బాలనాగిరెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చంద్రబాబుకు ఎన్నటికీ చేతకాదన్నారు. మూడేళ్లు గడిస్తే రెడ్ రాజ్యాంగం తుడిచిపెట్టుకు పోతోందన్నారు. కూటమిని కూకటి వేళ్లతో పీకేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు.
చంద్రబాబువి చెత్త ఆలోచనలు


