తుపాను గుప్పిట్లో అన్నదాతలు
మోంథా తుపాను గుప్పిట్లో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. అతి భారీ వర్షాలు లేకపోయినప్పటికీ కోతల వేళ తుపాను చుట్టుముట్టడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 21 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే జిల్లాను ముసురు పట్టుకుంది. జిల్లా యంత్రాంగం వర్షపాతం నమోదు వివరాలను ప్రతి 3–4 గంటలకు పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు.
322 హెక్టార్లలో పంట నష్టం
మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రాథమికంగానే అతి తక్కువగా చూపడం గమనార్హం. మోంథా తుపాను ప్రభావం హొళగుంద, చిప్పగిరి, కోసిగి, పెద్దకడుబూరు మండలాల్లోని ఎనిమిది గ్రామాలపై ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. మొత్తం 322 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రకటించారు. హొళగుంద మండలంలో 150 హెక్టార్లు, కోసిగి మండలంలో 120 హెక్టార్లలో వరి, చిప్పగిరి మండలంలో 17 హెక్టార్లలో శనగ మొత్తం 287 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. కాగా పెద్దకడుబూరు మండలం కంబలదిన్నె గ్రామంలో 30 హెక్టార్లు, కోసిగి మండలం డి.బెళగల్ గ్రామంలో 5 హెక్టార్లలో మిరప పంట దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రైతులకు రూ.11.75 లక్షల మేర నష్టం వాటిళ్లింది.


