రక్తదానం చేసి.. స్ఫూర్తి నింపి..
కర్నూలు: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో, ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలం కల్యాణ మండపంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పోలీసు సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానం చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ డీపీఓలో, ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి కమాండెంట్ దీపికా పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు సహా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. అమీలియో హాస్పిటల్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. డీపీఓలో 110 మంది, ఏపీఎస్పీ పటాలంలో 60 మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. ఉచిత మెగా వైద్య శిబిరాల్లో పోలీసు కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల వైద్యపరీక్షలు చేయించుకున్నారు. సదరన్ రీజియన్ హోంగార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, ప్రభుత్వాసుపత్రి డాక్టర్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.


