
పత్తి మద్దతు కొనుగోళ్లు మరింత ఆలస్యం
కర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లు మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే దాదాపు 2 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకాలు జరిగాయి. పత్తి కనీస మద్దతు ధర రూ.8,110 ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో క్వింటా పత్తి రూ.6,500 నుంచి రూ.7వేల వరకు ధరతో అమ్ముకొని నష్టపోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు 2,34,409 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 2.26 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. అధిక వర్షాల వల్ల పత్తి పంట భారీగా దెబ్బతినింది. దిగుబడులు హెక్టారుకు కనీసం 10 క్వింటాళ్లు పడిపోయింది. అంతంతమాత్రం వచ్చిన దిగుబడులకు కూడా ధర లేకపోవడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచే మార్కెట్‌లోకి పత్తి వస్తోంది. మామూలుగా అయితే సెప్టెంబర్ 20 నాటికే సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు జిన్నింగ్ మిల్లులను కూడా నోటిఫై చేయలేదంటే కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. మార్కెటింగ్ శాఖ అధికారుల సమాచారం మేరకు ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
గ్యాస్‌లీక్ ఘటనలో
గాయపడిన తల్లి, బిడ్డ మృతి
వెల్దుర్తి: వంట గ్యాస్ లీకై బోయనపల్లె గ్రామంలో గత ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వడ్డె నాగరాజు కోలుకోలేక కర్నూలులోని ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందారు. శనివారం ఉదయం గర్భిణి సువర్ణకు అబార్షన్ అయ్యింది. అనంతరం చిన్న కుమారుడు నాలుగేళ్ల చరణ్ కోలుకోలేక మృతి చెందాడు. తండ్రి, కుమారుడి అంత్యక్రియలు బోయనపల్లె గ్రామంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన అనంతరం కర్నూలు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న సువర్ణ సైతం మృతి చెందింది. దీంతో గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది.ప్రస్తుతం ఆసుపత్రిలో 12 ఏళ్ల అనిల్ చికిత్స పొందుతున్నాడు. కూలీ పనులు చేసి జీవనం సాగించే వడ్డె నాగరాజు కుటుంబంలో ఒక్కసారిగా ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఈతకు వెళ్లి వ్యవసాయ విద్యార్థి మృతి
మహానంది: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం బలిగొంది. మహానంది సమీపంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి పాలేరు వాగులో నీట మునిగి మృతి చెందాడు. మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండలం జిల్లెలమంద సమీపంలోని పెద్దతాండకు చెందిన బి.జనార్దన్‌నాయక్ (21) మహానంది సమీపంలోని వ్యవసాయ కళాశాలలో మూడో సంవత్సవరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం కళాశాల సమీపంలోని పాలేరువాగు వద్దకు తోటి విద్యార్ధులతో కలిసి వెళ్లాడు. అక్కడ కొంత మంది దుస్తులను శుభ్రం చేసుకోవడంతో పాటు ఈతకు దిగారు. ఈ క్రమంలో ఐదారుగురు ఈతకు దిగగా సరిగా ఈత రాని జనార్ధన్ నాయక్ వాగులోకి దిగాడు. కొద్ది సేపటికి పక్కనే ఉన్న అతను కనిపించకపోవడంతో మిగిలిన విద్యార్థులు అన్వేషించగా అక్కడే లోతు ఉన్న గుంతలో అపస్మారక స్థితిలో కనిపించాడు. బయటికి తీసి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పత్తి మద్దతు కొనుగోళ్లు మరింత ఆలస్యం