
మృత శిశువు కలకలం
నంద్యాల: పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఏ తల్లికి పుట్టిన బిడ్డో, ఎందుకు భారమయ్యాడో తెలియదు కాని చిన్నారి మృతదేహాన్ని ఇళ్ల మధ్యలో ఉన్న డ్రైనేజీలో పడేసి పోయారు. చనిపోయాక అక్కడ పడేశారా.. లేక ప్రాణం ఉన్న శిశువును అక్కడ వదిలేయడంతో మరణించారా అన్నది తెలియాల్సి ఉంది. పట్టణంలోని విశ్వనగర్ ఇళ్ల మధ్యలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు డ్రైనేజీ కాల్వ వద్దకు వెళ్లి చూడగా అక్కడ మగ శిశువు మృతదేహం కనిపించింది. ఎప్పుడు అక్కడ పడేశారో తెలియదు కాని శిశువు మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. ఈ విషయాన్ని స్థానికులు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ అస్రార్‌బాషా, ఎస్‌ఐ సురేష్ అక్కడ చేరుకొని శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. శిశువు మృతదేహాన్ని బట్టి కొన్ని రోజుల క్రితమే ఇక్కడ పడేసినట్లు కనిపిస్తుందని, స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా వారి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఆరిపోయిన ఆశల దీపం
● స్కూటర్‌పై నుంచి పడి బాలుడి మృతి
మంత్రాలయం రూరల్ : విధి ఆడిన నాటకంలో ఓ చిన్నారి జీవితం అర్థంతరంగా ముగిసిపోయింది. ఆ ఇంట తీరని శోకాన్ని నింపింది. మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన దేవర నాగప్ప, వీరేషమ్మ దంపతుల ఏకై క పుత్రుడు భీరప్ప (5). వంశాంకురమని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆ ఇంటిల్లిపాది తమ భవిష్యత్తును తనలోనే చూసుకున్నారు. పెద్దనాన్న సైతం అతనిపై ప్రాణం పెంచుకున్నాడు. శనివారం రోజూలాగే పెద్దనాన్న భీరప్పను తన స్కూటర్‌పై గ్రామంలోని మారెమ్మ దేవాలయం చెంతకు తీసుకెళ్లాడు. స్కూటర్‌ను ఆపుకుని ఉండగా అటుగా కాజన్న తన ఎడ్ల బండితో పొలానికి వెళ్తుండగా.. ఒక్కసారిగా ఎద్దులు బెదిరి స్కూటర్ వైపు దూసుకెళ్లాయి. ఎద్దులు స్కూటర్‌ను తగలడంతో పడిపోయింది. అయితే బైక్‌పై ఉన్న భీరప్ప దాని కింద పడటంతో మృతి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామమంతా శోకసంద్రంగా మారింది.