
కష్టం కరిగి.. నష్టం మిగిలి
తుగ్గలి/ కోడుమూరు రూరల్: ఆరుగాలం కష్టించి, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పండించిన ఉల్లి పంటకు ధర లేకపోవడంతో రైతులకు నష్టమే మిగులుతోంది. తుగ్గలి మండలం రాతనకు చెందిన రైతు వీరాంజనేయులు ఉల్లి పంటను కోసి వృథాగా పడేశాడు. తనకున్న 3.5 ఎకరాలతో పాటు ఎకరా రూ.15వేలు చొప్పున మరో రెండెకరాలు గుత్తకు తీసుకుని ఉల్లి పంట సాగు చేశాడు. మొత్తం రూ.3లక్షల పెట్టుబడి పెట్టాడు. ఉల్లి పంట మధ్యలో వాము పంటవేశాడు. దాన్ని కాపాడుకునేందుకు ఉల్లి పంట పీకి పారబోస్తున్నట్లు చెప్పారు. కోడుమూరులో ఓ రైతు పొలంలో నుంచి ఉల్లిగడ్డలను తెచ్చి ఖాళీ స్థలంలో కుప్పగా పోసి పశువులకు మేతగా వదిలేశారు. గిట్టుబాటు ధరలేక పశువులకు ఉల్లి పంటను మేతగా వదిలేయడాన్ని చూసిన జనాలు అయ్యో పాపం రైతన్న అంటూ నిట్టూర్చారు.
కోడుమూరులో ఉల్లిని పశువులకు వదిలేసిన దృశ్యం