
కామినేని హాస్పిటల్ వద్ద మృతదేహంతో ఆందోళన
కర్నూలు(హాస్పిటల్): గుండెపోటుతో వచ్చిన రోగి మృతిచెందడంతో కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్ ఎదురుగా ఉన్న జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్ వద్ద మృతుని కుటుంబ సభ్యులు శనివారం ఆందోళన చేశారు. కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన పెద్దమాదన్న(56)కు గుండెపోటు రావడంతో ఈనెల 5న కామినేని హాస్పిటల్‌లో చేర్పించారు. మల ద్వారం నుంచి రక్తస్రావం అవుతుండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గురు, శుక్రవారాల్లో కూడా గుండె ఆపరేషన్ వాయిదా పడింది. కాగా శనివారం మధ్యాహ్నం ఆయన కోలుకోలేక మృతిచెందాడు. వైద్యులు సకాలంలో ఆపరేషన్ చేసి ఉంటే బతికేవాడంటూ అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.