
టీడీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద రైతుల ఆందోళన
కల్లూరు: కర్నూలు నగరంలోని టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇంటి వద్ద పొగాకు రైతులు బుధవారం ఆందోళన నిర్వహించారు. వెంటనే పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ మాట్లాడుతూ.. కల్లూరు, ఓర్వకల్లు, కర్నూలు, వెల్దుర్తి మండలాల్లో పొగాకు పంటను విస్తారంగా సాగు చేశారన్నారు. పొగాకు కంపెనీలు ఐక్యమై రేటును పూర్తిగా తగ్గించాయన్నారు. పెట్టుబడి పెట్టిన రైతులు దివాలా తీసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినా ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు స్పందించలేదన్నారు. ప్రభుత్వం రూ. 273 కోట్లు విడుదల చేసిందని చెబుతున్నారని, ఎవరికిచ్చారో అర్థం కాలేదన్నారు. జిల్లా కేంద్రంలో కొనుగోలు కేంద్ర ఏర్పాటు చేసి పొగాకును కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం సహాయ కార్యదర్శి కృష్ణ, గొందిపర్ల మాజీ సర్పంచ్ ఆంజనేయులు, కల్లూరు, ఓర్వల్లు, కర్నూలు, వెల్దుర్తి మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.