
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
నందికొట్కూరు: భార్య కాపురానికి రాలేదని శాతనకోట గ్రామానికి చెందిన యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఫైజున్నిబీకి శాతనకోటకు చెందిన షేక్ ఇస్మాయిల్‌తో వివాహం జరిగింది. భర్త తాగుడుకు బానిస కావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో పది రోజుల క్రితం భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి కాపురానికి రాకపోవడంతో భర్త షేక్ ఇస్మాయిల్ (23) మనోవేధనకు గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబ సభ్యులు మంటలను ఆర్పి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తునట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.