
అప్పుడు యోగాంధ్ర.. ఇప్పుడు పేరెంట్స్ మీట్
గాడి తప్పుతున్న పాఠశాల విద్య
● ఇప్పటికీ మొదలుకాని పాఠాలు ● తీవ్ర ఒత్తిడిలో ఉపాధ్యాయులు
కర్నూలు సిటీ: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో పాఠశాల విద్య అస్తవ్యస్తమైంది. విద్యా సంవత్సరం మొదలైన నాటి నుంచి గత నెల 21వ తేదీ వరకు యోగాంధ్ర పేరుతో రోజు గంటల తరబడి వెబెక్స్‌లు.. టెలీకాన్ఫరెన్స్‌లు.. యోగాంధ్ర రిజిస్ట్రేషన్స్‌తో గడిచిపోయింది. ఆ తర్వాత ఉపాద్యాయుల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియతో మరికొంత సమయం ఆవిరైంది. ఇప్పుడిప్పుడే కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరిపోయి బోధన మొదలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతలోగా మోగా పేరెంట్స్ పేరిట నేటి నుంచి వారం రోజుల పాటు హడావుడి కొనసాగనుంది. ఈ పరిణామాలన్నీ చూస్తే ప్రభుత్వానికి విద్యార్థుల బంగారు భవిష్యత్ మీద ఏమాత్రం శ్రద్ధ లేదనే విషయం స్పష్టమవుతోంది. రికార్డులు, ప్రచారంపై ఉన్న ధ్యాస ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చడంపై చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాఠం మొదలే కాకుండా ఈ నెలఖారుకు కానీ, వచ్చే నెలలో నిర్వహించే ఎఫ్‌ఏ–1 పరీక్షలకు సిలబస్ ఎలా పూర్తి చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులు బీజీగా ఉంటున్నారని ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోతోంది. తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో జమకాని వారు సమావేశాల్లో పాల్గొంటేనే మలి విడతలో అవకాశం లభిస్తుందని చెప్పి సమావేశాలకు రప్పించాలని ఒత్తిడి తీసుకొస్తుండటం గమనార్హం. సమావేశాలను జయప్రదం చేయకుంటే చర్యలు తప్పవనే రీతిలో పరోక్షంగా స్కూళ్ల హెచ్‌ఎంలకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం.
టీచర్లకు నవాల్‌గా మెగా పేరెంట్స్ మీట్
ప్రభుత్వ స్కూళ్లతో పాటు, ప్రైవేటు స్కూళ్లలోనూ మోగా పేరెంట్స్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మద్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ సమావేశాలు జరిగినట్లు ఇతర శాఖల అధికారులను విట్నెస్ పెట్టాలని విద్యాశాఖ మొదట భావించింది. అయితే విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఆ స్కూల్ పూర్వ విద్యార్థి కానీ, స్థానికులతో వీడియో తీసి, అప్‌లోడ్ చేస్తే సరిపోతుందని నిర్ణయించింది. మోగా పెరెంట్స్ సమావేశాలు గిన్నిస్ రికార్డుల కోసమేనని, విట్నెస్ అవసరమని ఈ మేరకు మార్పు చేసినట్లు చర్చ జరుగుతోంది.
నిధులివ్వకుండా సమా‘వేషాలు’
విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ సమావేశానికి ఖర్చుల నిమిత్తం ఇప్పటివరకు పైసా కూడా నిధులు జమ చేయని పరిస్థితి. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 1406, జూనియర్ కాలేజీలు 23 ఉన్నాయి. వాస్తవానికి నెల రోజుల క్రితమే స్కూల్ గ్రాంట్‌లో మొదటగా 50 శాతం నిధులు మంజూరు చేస్తామని ప్రకటన జారీ చేసినా.. రెండు రోజుల క్రితం 983 స్కూళ్లకు పీఎఫ్‌ఎంఎస్ అకౌంట్‌లో జమ చేశామని, మిగిలిన 423 స్కూళ్లకు జమ చేస్తామని చెప్పడం గమనార్హం. సుమారు రూ.6 కోట్లు అవసరం కాగా.. రూ.3 కోట్లతో సరిపెట్టారు. అయితే ఇప్పటి వరకు ఏ స్కూల్‌కూ రూపాయి కూడా నిధులు చేరని పరిస్థితి. మొదట ప్రధానోపాధ్యాయులే చేతి నుంచి ఖర్చు పెట్టుకుని, ఆ తర్వాత బిల్లులు సబ్మిట్ చేస్తే ఖాతాలో నిధులు ఉన్నట్లయితే మంజూరవుతుంది. ఈ విషయం తెలిసి ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం నిర్వహించనున్న సమావేశాలకు స్కూల్ గ్రాంట్‌లో కేవలం పది శాతం మాత్రమే ఖర్చు పెట్టాలనే మెలిక పెట్టారు. ఆ నిధులు సమావేశం నిర్వహణకు ఏమాత్రం సరిపోవని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ఒక్కో స్కూల్‌లో కనీసం రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుందని, ప్రభుత్వం ఇచ్చే నిధులు పోగా మిగిలిన ఖర్చంతా తమ చేతి నుంచి పడుతుందేమోననే ఆందోళన నెలకొంది.