
జీఎస్‌టీ వసూళ్లలో గణనీయమైన ప్రగతి
● లక్ష్యానికి మించి 20 శాతం అదనంగా పన్నుల వసూలు ● పాత పన్ను బకాయిల వసూలుకు స్థిర, చరాస్తుల వేలం! ● వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ జె.నీరజ
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో జీఎస్‌టీ వసూళ్లలో గణనీయమైన ప్రగతి సాధించామని, లక్ష్యానికి మించి 20శాతం అదనంగా పన్నులు వసూలయ్యాయని, ఇందులో సిమెంట్ కంపెనీలదే అగ్రస్థానమని వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ జె.నీరజ చెప్పారు. బుధవారం ఆమె తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ.. ఎక్కువగా నంద్యాల జిల్లాలో ని సర్కిళ్ల నుంచి జీఎస్‌టీ వసూళ్లు వస్తున్నాయన్నారు. అక్కడ ఎక్కువగా సిమెంట్ కంపెనీలు ఉండటంతో పాటు గ్రానైట్ ఫ్యాక్టరీలు, గనులు ఉండటమే కారణమని తెలిపారు. కర్నూలు జిల్లాలో వ్యాపారాలు ఎక్కువ గా ఉన్నాయని, వాటి ద్వారా జీఎస్‌టీ వసూళ్లు వస్తున్నాయని చెప్పారు. ప్రతి నెలా రూ.110కోట్ల జీఎస్‌టీ వసూళ్లు లక్ష్యం కాగా రూ.120కోట్ల దాకా వసూలు అవుతున్నాయని అన్నారు. ఏడాదికి సగటున రూ.1200కోట్లకు పన్నులు వసూలవుతున్నట్లు వివరించారు. ప్రొఫెషనల్ ట్యాక్స్(వృత్తిపన్ను) వసూళ్లలో సైతం 20 శాతం అభివృద్ధి ఉందన్నారు. ఏడాదికి రూ.17కోట్ల లక్ష్యం కాగా ప్రతి నెలా రూ.2కోట్ల దాకా వసూలువుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పాత పన్ను బకాయిలు రూ.150కోట్ల వరకు ఉన్నాయని, ఇందులో ఒక్క ఆదోని సర్కిల్‌లోనే రూ.90కోట్ల దాకా ఉన్నాయన్నారు. మిగిలినవి ఎక్కువగా నంద్యాల జిల్లాలో ఉన్నట్లు తెలిపారు. వీటి వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం వారి స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసేందుకు జిల్లా కలెక్టర్ అనుమతితో చర్యలు తీసుకుంటున్నామన్నారు. తనిఖీల విషయంలో హెడ్ ఆఫీస్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటున్నట్లు చెప్పారు. వారి సమాచారం మేరకు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను ట్రాక్ చేసి పట్టుకుని జరిమానా విదిస్తున్నట్లు వివరించారు.