
అనాథ పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు
కర్నూలు(సెంట్రల్): ఉమ్మడి జిల్లాలో సాథి కమిటీ గుర్తించిన అనాథ పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు సంబంధిత శాఖలు చర్యల తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలావెంకట శేషాద్రి ఆదేశించారు. మంగళవారం న్యాయసేవా సదన్‌లో ఆయన సాథి కమిటీ శాఖల ఉన్నతధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిక్కులేని, అనాథ పిల్లలను గుర్తించే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి వారికి ఆధార్ కార్డులు ఇప్పించాలన్నారు. అయితే ఆధార్ కార్డులను పొందడానికి జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో మొదట వాటిని ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తరువాత ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఆధార్ ఎన్‌రోల్ చేయించి వారందరికీ సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు కలెక్టరేట్ నుంచి ఇంద్రాణి, డీఎంహెచ్‌ఓ శాంతికళ, నంద్యాల అదనపు డీఎంహెచ్‌ఓ శారదబాయి, కర్నూలు ఐసీడీఎస్ సీడీపీఓ శారద, నంద్యాల సీడీపీఓ స్వప్న, కర్నూలు అర్బన్ తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.