మామిడికి వరుణుడి దెబ్బ
● గత నెలలో భారీ వర్షాలతో దెబ్బతిన పంట ● పురుగు పట్టడంతో పడిపోయిన డిమాండ్ ● రైతులు, వ్యాపారులకు తీవ్ర నష్టం
కర్నూలు (అగ్రికల్చర్): గతంలో ఎపుడూ లేని విధంగా ఈ ఏడాది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మే నెలలో కురిసిన అధిక వర్షాలతో దిగుబడి దెబ్బతినింది. అకాల వర్షాలతో పాటు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో కాయలు నేలరాయి కోలుకోలేక పోయారు. ఉమ్మడి జిల్లాలో 12,256 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. 2023 – 24లో ఎకరాకు సగటున 8 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఈ సారి ఎకరాకు కేవలం 3–4 టన్నుల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇది కూడా అకాల వర్షాల వల్ల రైతులకు దక్కలేదు. మే నెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ ఉండగా... 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అధిక వర్షాల వల్ల మే నెలలోనే మామిడిలో విపరీతంగా పురుగు వచ్చింది. పురుగు ప్రభావం వల్ల ధరలు పతనం అయ్యాయి. దీంతో రైతులకు నష్టాలు భరించక తప్పలేదు. సాధారణంగా మామిడి తోటలను కొంద రు రైతులు పూత రావడానికి ముందే వ్యాపారులకు అమ్మేశారు. అయితే వాతావరణ పరిస్థితులతో మామిడిలో నాణ్య త దెబ్బతినడంతో వ్యాపారులు సైతం నష్టపోయారు. మామిడి టన్ను ధర మామూలుగా అయితే రూ.50 వేలకు పైగా ఉండాల్సి ఉండగా ఈ సారి టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.30 వేలు కూడా లభించని పరిస్థితి నెలకొంది.


