త్యాగానికి ప్రతీక ‘బక్రీద్’
కర్నూలు కల్చరల్: త్యాగానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకుంటారు. త్యాగమయ జీవితమే మానవ జన్మకు సార్థకమన్న అల్లాహ్ ఆదేశాలు పాటించడమే ఈ పండుగ ఉద్దేశం. ఈ వేడుక రోజే సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగరంలో హజ్ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ముస్లింలు ఈ పండుగను సంబరంగా చేసుకుంటారు.
పండుగ ఇలా..
పండుగ రోజు ప్రతి ముస్లిం శుద్ధి స్నానం చేసి, కొత్త దుసస్తులు వేసుకొని వజూ చేసుకొని, ‘అల్లాహు అక్బర్.. అల్లాహు అక్బర్. లాయిలాహ ఇల్లల్లా. అల్లహు అక్బర్. అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్’. అంటూ తజ్వీ చదువుంకుంటూ ఈద్గాహ్‌లకు చేరుకుంటారు. అక్కడ ముందుగా ఖాజీ, మౌల్వీ, మౌలానా, హఫీజ్, ఇమామ్ చేత సహపంక్తి సమాజ్ చేసిన తరువాత అరబ్బీ ఖుద్బాహ్, ఉర్దూ బయాన్ చదువుతారు. పండుగ ఎప్పుడు ఎలా ఏర్పడింది.. ఎందుకు చేసుకుంటారనే విషయాలు మత పెద్దలు చెబుతారు. ప్రవక్త ఇబ్రహీమ్ ఖలీలుల్లా, ఆయన తనయుడు ఇస్మాయిల్ జబీవుల్లా మధ్య జరిగిన వాస్తవ ఘటన మేరకు ఏర్పడిన ఈ పండుగ రోజున ముస్లింలు చేయాల్సిన మంచి, పుణ్య కార్యాలను వివరిస్తారు. అనంతరం దువా చేసి, సర్వ మానవాళి మంచి కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. సమాజంలో చెడు అంతం కావాలని వేడుకుంటారు. దువా పూర్తయ్యాక ఒకరినొకరు ‘ఈద్ ముబార్’ చెప్పుకొని అలింగనం చేసుకుంటారు. దాన ధర్మాలు చేస్తారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పుకొని ఇంట్లో చేసుకున్న ‘దూద్ సేమియా, షీర్ ఖుర్మా, కద్దూ ఖీర్, ఖుబానీక మిఠ’ లాంటి తీయ్యని వంటకాలతో వేడుక చేసుకుంటారు.
నేడు ఈద్ – ఉల్ –జుహా (బక్రీద్)
పండుగ నిర్వహణకు ఏర్పాట్లు
శాంతియుతంగా ..
పండక్కి ఒక రోజు ముందు ఉపవాసం (రోజా) ఉంటారు. పండుగ రోజున ఈద్ నమాజ్ చేసుకొని ఇంటికి వచ్చేంత వరకు ఎలాంటి ఆహారం, నీళ్లు తాగకుండా ఉపవాసం ఉంటే రోజా ఉన్నంత పుణ్యం లభిస్తుందని ముస్లిం మత పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాత ముక్తి కోసం ఖుర్బానీ ఇచ్చి, ఇతరులకు పంచి పెట్టి భక్తి చాటుకుంటారు. ఈ పండుగను ఘనంగా శాంతియుతంగా జరుపుకునేందుకు మత పెద్దలు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల వక్ఫ్, అధికారులు ఈద్గాహ్‌లల్లో తగిన సదుపాయాలు కల్పించారు.


