
రెండురోజుల శిశువుకు అరుదైన ఆపరేషన్
కర్నూలు(హాస్పిటల్): రెండురోజుల శిశువుకు అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు కర్నూలు పెద్దాసుపత్రి చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం.కృష్ణనాయక్ చెప్పారు. ఆపరేషన్ వివరాలను సోమవారం ఆయన వివరించారు. ఆలూరు మండలం హాలహర్వి గ్రామానికి చెందిన రాజమ్మ, రాజశేఖర్‌ల రెండు రోజుల మగ శిశువుకు పుట్టుకతోనే పేగు అభివృద్ధి కాలేదన్నారు. దీనిని వైద్యపరిభాషలో జజునల్ ఆట్రిసియాక్ అంటారని తెలిపారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందన్నారు. పేగుకు నిరంతరంగా కనెక్షన్ లేకుండా మధ్యలో తెగిపోయి ఉంటుందన్నారు. ఇలాంటి శిశువుకు ఈ నెల 17న ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కరించామన్నారు. ఇప్పుడు శిశువు నోటి ద్వారా పాలు తాగుతూ ఆరోగ్యంగా ఉందన్నారు. ఆపరేషన్ తనతో పాటు అనెస్తీషియా వైద్యులు డాక్టర్ శాంతిరాజు, పిల్లల వైద్యులు డాక్టర్ రచన, పీజీ వైద్యులు పవన్‌కృష్ణ, సింధూర నిర్వహించినట్లు వివరించారు.