
చందా ఇస్తేనే పంటలకు నీరు!
చాటింపు వాస్తవమే
మా ఊరి కాలువ పిచ్చిమొక్కలు, కంపచెట్లతో కూరుకుపోయింది. సాగునీరు సరఫరా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాలువ బాగు చేసుకునేందుకు నేనే ఊర్లో చాటింపు వేయించాను. కాలువ నుంచి నేరుగా నీళ్లు పెట్టుకునే వారికి ఎకరానికి రూ.1000, మోటార్ల ద్వారా నీళ్లు పెట్టుకునే రైతులు ఎకరానికి రూ.500 ఇవ్వాలని దండోరా కొట్టించాను. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో ఇలా చేయాలని నిర్ణయించాం.
–అబ్దుల్లా, గ్రామ టీడీపీ నాయకుడు
డబ్బులు ఇవ్వాలంటే కష్టమే
కాలువ పనులు చేయడానికి గ్రామంలో దండోరా వేయించారు. కాలువ పనులకు ఎకరానికి రూ.1000 ఇవ్వాలని చెప్పారు. కాలువ పరిధిలో నాకు మూడు ఎకరాలు ఉంది. రూ.3 వేలు భరించాలంటే ఇబ్బందే. ప్రభుత్వం నుంచి పైసా సాయం లేదు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రైతులు డబ్బులు ఇవ్వాలంటే కష్టమే. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మా కాలువను బాగు చేసింటే బాగుండు.
–చిన్న ఉసేని, గ్రామ రైతు
● రైతుల నుంచి టీడీపీ నాయకుడి
బలవంతపు వసూళ్లు
● పంట కాలువ బాగు కోసం దండోరా
● ఎకరానికి రూ.1000 ఇవ్వాలంటూ
చాటింపు
● రాష్ట్ర ప్రభుత్వం పని చేయాల్సి ఉన్నా..
విరుద్ధంగా వ్యవహారం
మంత్రాలయం: ‘‘వినండహో.. ఇందు మూలంగా రైతులకు తెలియజేయడం ఏమనగా .. మన ఊరి పంట కాలువ పిచ్చిమొక్కలు, కంపచెట్లతో కూరుకుపోయింది. పంట కాలువను బాగు చేసుకునేందుకు చందాలు ఇవ్వాలని నిర్ణయం. కావున రైతులంతా చందా లు ఇచ్చుకోగలరు.. లేదంటే మీ చేనుకు నీళ్లు రావు.. వినండహో..’’ అని మంత్రాలయం మండలంలోని వగరూరు గ్రామంలో టీడీపీ నాయకుడు దండోరా వేయిస్తున్నాడు. వాస్తవంగా పంట కాలువలను బాగు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ టీడీపీ నాయకుడు అందుకు విరుద్ధంగా వ్యహరిస్తున్నాడు.
కాలువ ఏర్పాటు ఇలా..
మంత్రాలయం మండలంలోని వగరూరు గ్రామం పైభాగంలో గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద సూగూరు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నెలకొల్పారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. పథకం కింద 2,700 ఎకరాల ఆయకట్టు నిర్ణయించారు. బూదూరు, సూగూరు, వగరూరు, వి.తిమ్మాపురం గ్రామాలకు నీరందించాల్సి ఉంది. అయితే పంట కాలువల నిర్వహణ గాలికి వదిలేయడంతో పూర్తిస్థాయిలో సాగునీరు అందని వైనం. ప్రస్తుతం వగరూరు, వి.తిమ్మాపురం గ్రామాల పరిధిలో 1,500 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారు. అందులో వగరూరు గ్రామంలో 1,000 ఎకరాలకు సాగునీరు పారుతోంది. జలాశయంలో వరద నీరు పుష్కలంగా ఉంటే రెండు కారుల పంటలు ఇక్కడి రైతులు తీస్తున్నారు.
టీడీపీ నాయకుడి దాష్టీకం..
రాష్ట్ర ప్రభుత్వం పంట కాలువ మరమ్మతులకు నయాపైసా కేటాయించలేదు. ఇదే అదునుగా చేసుకున్న గ్రామ టీడీపీ నాయకుడు పంట కాలువ బాగు కోసం సరికొత్త పథాన్ని ఎంచుకున్నాడు. సోమవారం గ్రామంలో కాలువ రిపేరీ పేరుతో ఏకంగా దండోరా వేయించారు. కాలువ పరిధిలోని ఆయకట్టు రైతులు ఎకరానికి రూ.వెయ్యి, మోటార్లతో నీరు తోడుకునే రైతులు ఎకరానికి రూ.500 ఇచ్చుకోవాలని చాటింపు వేయించారు. ఇచ్చుకోని రైతుల పొలాలకు నీరు పెట్టుకోవడానికి లేదంటూ ఊరి వీధుల్లో దండోరా కొట్టించారు. గ్రామ టీడీపీ నాయకుడు అబ్దుల్లా ఆజ్ఞ మేరకు చాటింపు వేయించారు.
మునుపటికి భిన్నంగా
ప్రాజెక్టు పరిధిలో పంట కాలువ బాగు కోసం మునుపెన్నడూ దండోరా వేయించలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిధులతో పంట కాలువను బాగు చేయించింది. కూటమి ప్రభుత్వం పుణ్యమా అని ఈ ఏడాది రైతులపై భారం పడేలా చేసింది. కాలువను బాగు చేయడానికి పైసలు ఇవ్వకపోవడంతో రైతుల నుంచి వసూళ్లు చేసేందుకు టీడీపీ నాయకుడు ముందుకు రావడం చర్చనీయాంశమైంది. దండోరాను చూసి రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే దరిద్య్రమని వాపోతున్నారు. ప్రభుత్వానికి సిగ్గుచేటని దుమ్మెత్తిపోస్తున్నారు.

చందా ఇస్తేనే పంటలకు నీరు!

చందా ఇస్తేనే పంటలకు నీరు!

చందా ఇస్తేనే పంటలకు నీరు!