
పొగాకు రైతుకు ‘ధరా’ఘాతం
నష్టమే మిగిలింది
ఈ ఏడాది రైతులు పండించిన కంది, పత్తి, పొగాకు మిరప పంటలకు ధర పూర్తిగా తగ్గిపోయింది. బ్యాంక్ అధికారులు మాత్రం రుణాలు కట్టమంటూ ఒత్తిడి చేస్తున్నారు. అప్పులు ఇచ్చే వాడే లేడు. రైతన్నకు ఏంచేయాలో అర్థంకాని రోజులు ఎదురయ్యాయి. వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే రోజులు వచ్చాయి.
– షేక్ హుసేన్, యు.కొత్తపల్లి,
కష్టంగా ఉంది
రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. నేను మూడు ఎకరాలలో పోగాకు నాటా. కింటా రూ.15వేల నుంచి రూ. 18వేల వరకు అమ్ముకున్నాం. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. వచ్చే ఏడాది పెట్టుబడికి కష్టంగా ఉంది.
– కోయికొండ చిన్నమద్దయ్య, ఉడుములపాడు
డోన్: పొగాకు పండించిన రైతుకు కన్నీరే మిగులుతోంది. మార్కెట్‌లో ధర లేకపోవడంతో నష్టాలు వస్తున్నాయి. పంటకు పెట్టిన పెట్టుబడి రాకపోయినా బ్యాంక్‌లు రుణాలు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డోన్ నియోజకవర్గంలో 258 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. ప్యాపిలి మండలంలో రాచర్ల, బూరుగుల, ప్యాపిలి, బేతంచెర్ల మండలంలో బుగ్గానిపల్లి, అంబాపురం, బేతంచెర్ల, డోన్ మండలంలో వెంకటాపురం, చిన్నమల్కాపురం, ఉడుములపాడు, వెంకటనాయునిపల్లి గ్రామాలలో ఎక్కువగా పొగాకు పంటను పండించారు. గత ఏడాది క్వింటా రూ.15వేల నుంచి రూ.18వేల ధర పలికింది. ప్రస్తుతం రూ.5వేల నుంచి రూ.7వేలకు పడిపోయింది. పంట సాగులో ఎకరాకు రూ.70వేల నుంచి రూ.80వేల ఖర్చు వచ్చింది. పండించిన పొగాకు చెక్కులు తీసుకెళ్తే ఐటీసీ, జీపీఐ, ఎలైన్ కంపెనీ నిర్వాహకులు తేమ శాతం ఎక్కువ ఉందని వెనక్కి పంపిస్తున్నారు. దీంతో రైతులు పొగాకు అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 15 చెక్కులు తీసుకెళ్తే అందులో తేమ శాతం రేటు ఎక్కువ ఉందని చెప్పుతున్నారు. దళారులు వచ్చి ‘రూ. 5వేలకు ఇస్తావా? 4వేలకు ఇస్తావా?’ అని అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.
మార్కెట్‌లో పొగాకు పంటకు
పడిపోయిన ధరలు
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
రుణాలు చెల్లించాలని బ్యాంక్‌ల ఒత్తిడి
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

పొగాకు రైతుకు ‘ధరా’ఘాతం

పొగాకు రైతుకు ‘ధరా’ఘాతం