
మల్లన్న సేవలో సినీ హీరో అర్జున్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ప్రముఖ సినీ హీరో అర్జున్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం శ్రీశైలం చేరుకుని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే ఆలయంలో గోసేవ నిర్వహించుకున్నారు. సినీ హీరో అర్జున్‌తో కరచాలనం చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆయనతో పలువురు సెల్పీలు, ఫొటోలు దిగారు.
చిన్నారులకు ఎంఆర్ వ్యాక్సిన్
కర్నూలు(హాస్పిటల్): చిన్నారుల్లో తట్టు, పొంగు, రూబెల్లా వ్యాధుల నివారణే లక్ష్యంగా ఎంఆర్ వ్యాక్సిన్ ఆరు రోజుల పాటు వేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగప్రసాద్ చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఎంఆర్ వ్యాక్సిన్‌పై స్పెషల్ ప్రారంభించామన్నారు. జిల్లాలో ఎంఆర్–1 వ్యాక్సిన్‌ను 33 మంది, ఎంఆర్–2 వ్యాక్సిన్‌ను 36 మంది వేయించుకోలేదని ప్రాథమికంగా తాము గుర్తించినట్లు తెలిపారు. వీరితో పాటు ఇంకా ఎవ్వరైనా వేయించుకోకపోయినా, ఇతర ప్రాంతాల వారున్నా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో, అంగన్‌వాడీ కేంద్రంలో, సచివాలయంలో వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.