
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
కర్నూలు(సెంట్రల్): రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా అవసరం ఉంటే ప్రజలు 08518–277305కు ఫోన్ చేసి తెలిపితే తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు.
‘ఉత్కర్ష్’కు
ఏడు గ్రామాల ఎంపిక
కర్నూలు(సెంట్రల్): గిరిజన వర్గాల సామాజిక–ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’కు జిల్లాలో ఏడు గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రాలయం మండలం పరమాన్‌దొడ్డి, నెరణికి, హొళగుంద మండలంలోని హొళగుంద, కోగిలతోట, మద్దికెర మండలంలోని పెరవళి, మద్దికెర(తూర్పు), హంప గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో 17 శాఖల ద్వారా వివిధ సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు
101 ఫిర్యాదులు
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 101 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మహానాడు బందోబస్తులో విధుల నిమిత్తం కడపకు వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పీజేఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించారు. చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీసీఆర్‌బీ సీఐ గుణశేఖర్ బాబు, సీఐలు కేశవరెడ్డి, తేజామూర్తి తదితరులు కూడా పీజేఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత సమస్యలు, నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసుకుని మోసం చేసిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.
ఈ ఏడాదే బీసీ, డీఎన్‌టీ హాస్టళ్ల పునః ప్రారంభం
● డీబీసీడబ్ల్యూఓ కే ప్రసూన
కర్నూలు(అర్బన్): జిల్లా కేంద్రంలో మూతకు గురైన బీసీ, డీఎన్‌టీ బాలుర వసతి గృహాలను ఈ విద్యా సంవత్సరం నుంచి పునః ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు బీ క్యాంప్‌లోని ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో కొనసాగుతున్న ఈ రెండు వసతి గృహాలకు చెందిన భవనాలు పూర్తి శిధిలావస్థకు చేరాయన్నారు. తాత్కాలికంగా ఈ వసతి గృహాలను 2023 ఏప్రిల్ నెలలో మూత వేశామన్నారు. కల్లూరులోని పాత ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ భవనంలో ఈ వసతి గృహాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ రెండు వసతి గృహాలకు సమీపంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఉన్నందున విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందన్నారు.
ఫీజు వివరాలు యాప్‌లో నమోదు చేయండి
కర్నూలు(అర్బన్): జిల్లాలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సులు చదువుతున్న ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఫీజు వివరాలను జ్ఞానభూమి యాప్‌లో నమోదు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.తులసీదేవి కోరారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలలకు మంజూరైన ఉపకార వేతనాలను 2024 మార్చి 1వ తేదిన మొదటి విడతగా విద్యార్థుల జాయింట్ ఖాతాలో జమ చేసినట్లు ఆమె సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఎస్సీ విద్యార్థుల ఖాతాలకు నాలుగు విడతల ఫీజును విడుదల చేశారన్నారు. ప్రభుత్వం జమ చేసిన నగదును ఆయా కళాశాలల ఖాతాలకు జమ చేశారా ? లేదా ? అనే విషయంపై జిల్లాలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు/వార్డు ఎడ్యుకేషన్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీలు తమ పరిధిలో సర్వే నిర్వహించి సమాచారాన్ని జ్ఞానభూమి యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం జమ చేసిన ఫీజు మొత్తాలను కాక మిగిలిన ఫీజును విద్యార్థులు చెల్లించి ఉంటే, రసీదులను ఈ నెల 28లోగా జ్ఞానభూమి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. సర్వే పూర్తయిన అనంతరం ఫీజు బకాయిలను విడుదలవుతాయని డీడీ వెల్లడించారు.