
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
రుద్రవరం: నర్సాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అహోబిలానికి చెందిన రంగ సుబ్బరాయుడు (70) గురువారం కారులో ఆళ్లగడ్డకు వెళ్లి అక్కడ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో రవి డిగ్రీ కళాశాల సమీపంలో ఎదురుగా వరిగడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన యువకుడు మృతి
ఆదోని సెంట్రల్: ఆదోని రైల్వేస్టేషన్‌లో గత నెల 27వ తేదీన ప్రమాదవశాత్తూ రైలు దిగుతూ కింద పడి గాయపడిన యువకుడు రాజశేఖర్ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. నారాయణపురం గ్రామానికి చెందిన ఈ యువకుడిని మొదట ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సల నిమిత్తం కర్నూలుకు తరలించారు. పది రోజుల నుంచి కర్నూలులో చికిత్సలు పొందుతూ కోలుకోలేక గురువారం మృతిచెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాయి సర్వేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రైలు ఢీకొని రైతు దుర్మరణం
ఆదోని సెంట్రల్: రైలు ఢీకొనడంతో పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు.. ఇస్వీ–కుప్పగల్ రైల్వేస్టేషన్ల మధ్య కి.మీ. 523/23–24 వద్ద తన అన్న చేనులో వేసిన కనకాంబరాల పంటకు నీరు పెట్టడానికి బంగారయ్య(35) బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వెళ్లాడు. రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో తీవ్ర రక్తగాయాలపాలైన బంగారయ్య అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య తాయమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి