
బయో ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు
కోవెలకుంట్ల: అనుమతులు లేని బయో ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ హెచ్చరించారు. స్థానిక మార్కెట్ యార్డు రైతు విశ్రాంతి భవనంలో శుక్రవారం సబ్ డివిజన్‌లోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల రసాయన ఎరువులు, విత్తన, పురుగు మందుల డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ జీ–2, జీ–3 అప్లియేషన్ కలిగి వ్యవసాయ కమిషనర్ ఆమోదించిన బయో ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలన్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు విత్తన, ఎరువుల డీలర్లు నాసిరకం విత్తనాలు, ఎరువులు అంటగడుతున్నారన్నారు. విత్తన చట్టం పరిధిలో అధీకృత కంపెనీల ద్వారా జిల్లాలోని రైతులకు నాణ్యమైన రసాయన ఎరువులు, కల్తీ లేని విత్తనాలు, క్రిమి సంహారక మందులు సరఫరా చేయాలన్నారు. రైతులకు తప్పని సరిగా బిల్లులు ఇవ్వాలన్నారు. స్టాక్ వివరాలు, నిల్వలు, గరిష్ట ధరను పొందుపరిచి విక్రయాలు జరపాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏడీఏ సుధాకర్, జిల్లా వ్యవసాయ కార్యాలయ టెక్నికల్ ఏఓ కల్యాణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.