
హిట్ అండ్ రన్ కేసులు త్వరితగతిన పరిష్కరించండి
కర్నూలు: హిట్ అండ్ రన్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సరైన నష్టపరిహారం ఇప్పించాలని జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతో హిట్ అండ్ రన్ కేసులపై సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 76, నంద్యాల జిల్లాలో 38 హిట్ అండ్ రన్ కేసులు దర్యాప్తు దశలో(ప్రాసెస్) ఉన్నాయని అధికారులు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సరైన నష్టపరిహారం ఇప్పించాలన్నారు. సమావేశంలో నంద్యాల జిల్లా రెవెన్యూ ఆఫీసర్ రాము నాయక్, కర్నూలు రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ భారతి చవాన్, కర్నూలు జిల్లా రెవెన్యూ ఆఫీస్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, డీసీఆర్‌బీ సీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.