
సార్.. కందులు కొనుగోలు చేయడం లేదు
కొత్తపల్లి: ‘కందుల కొనుగోలు నిర్వాహకుల నిర్లక్ష్యంతో దిగుబడిని అమ్ముకోలేక పోతున్నాం. రోజులు తరబడి నిరీక్షిస్తున్నా పట్టించుకోవడం లేదు’ అని రైతులు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌కు మొర పెట్టుకున్నారు. దుద్యాల గ్రామంలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కేంద్రం వద్ద కందు ల నాణ్యత, రైతుల ఆన్‌లైన్ వివరాల నమోదు, తుకా లు, క్యూఆర్ కోడ్ ట్యాగ్ పనితీరు, కందుల నాణ్యతను కొలిచే యంత్రం పనితీరులను క్షుణ్ణంగా పరిశీలించా రు. జేసీ వచ్చారనే సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని తమ సమస్యలు విన్నవించారు.
● ఎకరాకు ఐదు క్వింటాల కందులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయాలని కోరారు.
● 20 రోజులైనా తన కందులను తీసుకోవడం లేదని రైతు నాగేశ్వరరావు జేసీకి మొరపెట్టుకున్నారు. అధికారులను అడిగితే తిప్పుకుంటున్నారన్నారు.
● ఈనెల 20వ తేదీతో కొనుగోలు గడువు ముగిసిందని సమయం పెంచి న్యాయం చేయాలన్నారు.
● నేషనల్ హైవే రహదారి నిర్మాణానికి మామిడి తోటలో ఉన్న సుమారు 22 మామిడి చెట్లు పోయాయని ఇంతవరకు పరిహారం అందలేదని ఓ మహిళ రైతు జేసీకి విన్నవించింది.
● కల్లాలకు ఆన్‌లైన్ సమస్య పరిష్కారం కావడం లేదని, పూర్వపు ఆస్తులు అమ్ముకునేందుకు పేర్లులేక ఇబ్బంది పడుతున్నామని రైతులు తెలిపారు.
● అనంతరం జేసీ మాట్లాడుతూ.. స్థానిక రెవెన్యూ అధికారులతో రైతుల సమస్యకు సమాధానం చెప్పాలని సమస్య ఏ స్థాయిలో ఉందో వెంటనే నాకు సమాచారం కావాలని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వెంట ఆత్మకూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఆంజనేయ, తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీఓ దాసరి మేరీ, ఎంపీపీ కుసుమలత, సర్పంచ్ శోభలత, మండల వ్యవసాయ అధికారి మహేష్ పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్‌కు సమస్యల వెల్లువ