ఆధిపత్యం కోసమే అంతమొందించారు | - | Sakshi
Sakshi News home page

ఆధిపత్యం కోసమే అంతమొందించారు

Mar 22 2025 1:22 AM | Updated on Mar 22 2025 1:17 AM

● వీడిన టీడీపీ నేత సంజన్న హత్యకేసు మిస్టరీ ● ఐదుగురు నిందితుల అరెస్ట్‌ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు: టీడీపీ నాయకుడు షరీన్‌నగర్‌కు చెందిన కాశపోగు సంజన్న హత్య కేసు మిస్టరీ వీడింది. షరీన్‌నగర్‌లో ఆధిపత్యం కోసమే సంజన్నను వడ్డె రామాంజనేయులు అలియాస్‌ అంజి కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వడ్డె రామాంజనేయులు, వడ్డె శివకుమార్‌, వడ్డె తులసి, రేవంత్‌, వారి అనుచరుడు మాల అశోక్‌ను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఎదుట హాజరు పరిచారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో దర్యాప్తు అధికారి మహిళా పీఎస్‌ డీఎస్‌పీ కే శ్రీనివాసాచారి, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్‌తో కలిసి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన రాత్రి 9.30 గంటల ప్రాంతంలో షరీన్‌నగర్‌లో అల్లీపీరా, వీరాస్వామి భజన మందిరంలో భజన ముగించుకుని బయటకు వస్తున్న కాశపోగు సంజన్నపై అదే వీధికి చెందిన వడ్డె రామాంజనేయులు అతని కుమారులు కొంత మంది అనుచరులు కలిసి పిడిబాకులు, కత్తులు, వేటకొవళ్లతో దాడి చేసి హత్య చేశారు. 30వ వార్డు కార్పొరేటర్‌ జయరాముడుకు హతుడు సంజన్న తండ్రి. జయరాముడు ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించుకొని నిందితుల కదలికలు, వారు వినియోగించిన వాహనాలు, సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించి కాదాంబరి టౌన్‌షిప్‌ సమీపంలోని నిర్జన ప్రదేశంలో అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. హత్యకు వాడిన వేట కొడవళ్లు, పిడిబాకు, రక్తం మరకలు ఉన్న దస్తులు, సెల్‌ఫోన్లు, కర్రలు, హత్య సమయంలో వాడిన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, ప్రతి వారం స్టేషన్‌ పరిధిలోని రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు ఎస్‌పీ చెప్పారు.

శిక్షలు పడే విధంగా చర్యలు ...

విచారణ వేగవంతం చేసి నిందితులపై కఠిన శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మృతుడు సంజన్న కుటుంబం, హంతుకులు వడ్డె రామాంజనేయులు కుటుంబం మధ్య ఉన్న పాతకక్షలు, వార్డులో ఆధిపత్య పోరే కారణంగా దర్యాప్తులో తేలిందని వివరించారు. చాకచక్యంగా, వేగంగా కేసును ఛేదించి త్వరగా నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐలు మధుసూదన్‌గౌడ్‌, శేషయ్య, చంద్రబాబునాయుడు, శ్రీధర్‌, తబ్రేజ్‌, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement